కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వండి.. మోదీని కోరిన కెనడా పీఎం

కరోనా వ్యాక్సిన్‌కు కెనడాకు ఇవ్వాలని.. ఆ దేశ ప్రధాని ట్రూడో ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన మోదీకి ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా అన్ని విధాలా సహకారం అందించేందుకు కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ‘కరోనాపై ప్రపంచం విజయం సాధిస్తే.. అది భారత్​ వద్ద ఉన్న అపారమైన ఫార్మా సామర్థ్యం, దాన్ని ఇతర దేశాలకు పంచుకునే విషయంలో మోదీ నాయకత్వం వల్లేనని’ ట్రూడో అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో కెనడాలో టీకా అవసరాల గురించి మోదీకి ట్రూడో వివరించారు. ఫలితంగా.. భారత్ తన వంతు కృషి చేస్తుందని మోదీ ఆయనకు భరోసానిచ్చారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై కలుసుకుని ఇరు దేశాల సంబంధాలపై చర్చించుకునేందుకు నేతలిద్దరూ అంగీకరించారు. వాతావరణ మార్పు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై పరస్పర సహకారం కొనసాగించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌ కింద భారత్‌ పలుదేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తోంది. పలు దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్‌ను అందించిన విషయం తెలిసిందే.