జీవో 217 రద్దు చేయాలి: నాదెండ్ల మనోహర్

తూర్పుగోదావరి, మత్స్యకారుల అభివృద్ధికి విఘాతం కలిగించే జీవో217 రద్దుచేయాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. మత్యకారుల భరోసా కోసం జనసేన అభ్యున్నతి యాత్రలో భాగంగా మత్స్యకార ప్రాంతాల్లో పర్యటిస్తున్న నాదెండ్ల మనోహర్ సోమవారం కాకినాడలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలకు భిన్నంగా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. మత్స్యకారుల నివాస ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక సమస్యలకు నిలయాలుగా ఉన్నాయన్నారు. వేట విరామ సమయం జీవనభృతిలో భాగంగా మత్యకార భరోసా కింద రూ. 10 వేలు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం లక్ష మందికి మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మిగిలిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రమాదంలో మరణించిన మత్యకార కుటుంబాలకు రూ.10 లక్షల భీమా ఏమైందని ప్రశ్నించారు. డీజిల్ పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మత్స్యకారులకు ఏ మాత్రం సరిపోని పరిస్థితి అని మూడు వేల లీటర్లు డీజిల్ వినియోగించుకుంటే కేవలం 300 లీటర్ల కి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని అన్నారు. మత్యకార ప్రాంతాలను డంపింగ్ యార్డ్లుగా మార్చేశారని కనీస వసతులు కూడా కల్పించకపోవడం దారుణమన్నారు. జీవో 217 కారణంగా వేలాది మంది జీవనోపాధిని కోల్పోపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన మత్యకార వికాస విభాగం ద్వారా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నామని తద్వారా వచ్చే వినతులు అన్నిటిని క్రోడీకరించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మెరుగైన ప్రణాళికలతో జనసేన మత్యకారుల హక్కుల ప్రభుత్వంలో కదలిక వచ్చేవరకు పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, నియోజకవర్గ ఇంచార్జ్ లు, నాయకులు పాల్గొన్నారు.