గుర్రం చెరువుకు గండి.. జలమయమైన కాలనీలు

శనివారం నగరవ్యాప్తంగా కురిసిన ఏకధాటి వర్షాలకు పాతబస్తీ శివారు ప్రాంతంలోని గుర్రం చెరువుకు గండి పడింది. దీంతో బాబానగర్, నర్కి పుల్ బాగ్ ఉప్పుగూడా, శివాజీ నగర్, సాయిబాబానగర్, తానాజీ నగర్, భయ్యాలాల్ నగర్ లలో ఇండ్లు నీట మునిగాయి. ఇండ్లలో ఐదు ఫీట్ల మేర వరద నీరు చేరుకుంది. రోడ్లపైకి భారీగా వచ్చి పడిన వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లన్నీ నడుంలోతు నీళ్లలో మునిగిపోయాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అదేవిధంగా చైత్యనపురి కమలనగర్ రోడ్డు నెంబర్-5 లో కురిసిన భారీ వర్షానికి వరద ఒక్కసారిగా ఉప్పొంగింది. వరదలో కొట్టుకుపోతున్న నలుగురిని స్థానిక కాలనీవాసులు కాపాడారు.

వరద నీటిని తరలించేందుకు రెండు రోజుల క్రితమే అధికారులు గుర్రం చెరువుకి గండికొట్టారు. అయితే, శనివారం సాయంత్రం పడిన భారీ వర్షానికి గుర్రం చెరువు నిండి పోయి నీరంతా బయటకు వచ్చేసింది. హఫీజ్ బాబా నగర్ ఏరియా ఉన్న ఇళ్లన్నీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం జలమయమైంది.