హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ప్రజలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ పేర్కొన్నారు. సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించింది అని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన జీవోను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కీలకమైన ప్రకటన చేస్తున్నా. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే మౌలిక వసతులు ఉండాలి. దానికి అనుగుణంగా ఏడు సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్ మహానగరంలో తాగునీటికి సమస్య లేకుండా చేశాం. తాగునీటి సమస్య 90 శాతం పూర్తయింది. ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా సమస్యల్లేవు. పరిశ్రమలతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్ వాటర్ ప్లస్ సిటీగా పేరొందింది.

హెచ్‌యూఏ పరిధిలో రోజుకు 1950 ఎంఎల్‌డీ మురికి నీరు ఉత్పత్తి అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్‌డీ మురికి నీరు ఉత్పత్తి అవుతోంది. మూసీ ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ గురించి సీఎం కేసీఆర్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లాం. కేబినెట్ సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజి ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 772 ఎంఎల్‌డీ సీవరేజ్ ప్లాంట్లకు అదనంగా 1260 ఎంఎల్‌డీ సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. దీనికోసం రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించింది. 31 ప్రాంతాల్లో ఈ సీవరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ ప్రజల తరపున సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ప్రజలకు మంచి నీటి నిర్వహణ కోసం రూ. 1200 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ తెలిపారు. మురుగు నీరు శుద్ధి, మంచినీటి కోసం ఒకే రోజులో రూ. 5000 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం గొప్ప విషయమన్నారు. రెండేళ్లలోనే ఈ పనులన్నీ పూర్తి చేస్తామని వివరించారు.