ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది.షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది.

ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మంగళవారం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో డివిజన్‌ బెంచ్‌ ఎదుట వాదనలు జరిగాయి. ఎస్‌ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వర్ల రామయ్య తెదేపా తరఫున పిటిషన్‌ వేయలేదని, వ్యక్తిగతంగా రిట్‌ పిటిషన్‌ వేయకూడదని సీవీ మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 28 రోజులు కోడ్‌ ఉండాలనేది సుప్రీం ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని పేర్కొన్నారు. కోడ్‌ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింప జేయాల్సిన అవసరం లేదన్నారు. పిటిషన్‌లో సరైన వివరాలు లేవని ఎస్‌ఈసీపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన పేపర్లతో మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు ముందుకు రావాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 12గంటల తర్వాత మరోసారి వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.