హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పొంగిపొర్లుతోన్న నాలాలు..

హైదరాబాద్‌ను భారీ వర్షాలు నిలువెత్తున తడిపేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా జంటనగరాల్లో రోజూ ఏదో సమయాన వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. రాత్రి నుంచి భాగ్యనగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాలాలు పొంగిపొర్లాయి. ఈశాన్య రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా పలు వాగులు, వంకలు పొంగి పోర్లుతుండడంతో జలాశయాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఇదిలా ఉంటే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా తెలంగాణలో వచ్చే మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతోపాటు.. వరంగల్‌ అర్బన్‌, గ్రామీణం, మహబూబాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇటు, హైదరాబాద్‌లోనూ పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. ఇక గ్రేటర్‌లో వర్షం, సంబంధిత సమస్యలు తలెత్తితే అత్యవసర సహాయం కోసం 100 నంబరు కు కానీ, 040-29555500 నంబరుకు కానీ సమస్యలు తెలియచేయవచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు సూచించారు.