పాలనపై పట్టు లేక రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారు

• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడానికి శ్రీ జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు
• అధికారులపై ఈ ముఖ్యమంత్రికి విశ్వాసం లేదు
• మంత్రి పోలీసు అధికారి చొక్కా పట్టుకొంటుంటే ఏం చేయాలి?
• ముఖ్యమంత్రి ఇంట్లోంచే బయటకు రావడం లేదు
• తణుకులో మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. పాలనపై ఏ మాత్రం పట్టులేకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో రూ. 92,700 కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు రూ.6 లక్షల 70వేల కోట్లకి చేరిందని, సంక్షేమం పేరుతో సామాన్యుడికి తీరని నష్టం జరుగుతుందన్నారు. భారీస్థాయిలో అప్పులు చేసిన ప్రభుత్వం- కనీస మౌలిక వసతులు కానీ, యువతకు ఒక్క ఉద్యోగం కానీ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన 12 పేజీల శ్వేతపత్రం పూర్తిగా సత్య దూరమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తణుకులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ గతంలో మీ తండ్రి గారి దగ్గర పనిచేసిన అధికారులు ఒక మంచి మనసుతో ముందుకొచ్చి వాళ్లు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మీతో పాటు పని చేస్తుంటే ఆ అధికారులపై ముఖ్యమంత్రి మాత్రం విశ్వాసం చూపడం లేదు. మూడు నెలలకో, ఆరు నెలలకో బదిలీ చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ భవిష్యత్ గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. అధికార యంత్రాంగాన్ని భయపెట్టిస్తున్నారు. ఉద్యోగులకు హామీలు నెరవేర్చలేదు. పి.ఆర్.సి.పై వారు నిరసన తెలిపితే పోలీసుల ద్వారా భయపెట్టి… సమస్యను తానే పరిష్కరించగలను తన దగ్గరకు పిలిపించుకున్నారు. ముఖ్యమంత్రికి పరిపాలనపై ఏ మాత్రం పట్టులేదు. ఇంట్లో నుంచి ఆయన బయటకే రారు. ప్రజల గురించి పట్టించుకునే ఆలోచనే లేదు.

• వాస్తవ దూరమైన డాక్యుమెంట్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పత్రికల్లో వస్తున్న వార్తలు, ప్రతిపక్షాలు చెబుతున్న విషయాలను ఖండిస్తూ ప్రభుత్వం ఇచ్చిన 12 పేజీల డాక్యుమెంట్లో విషయాలు సత్యదూరాలు. వాస్తవానికి దూరంగా ఉంది. నిజాయతీగా లేని డాక్యుమెంట్ ఇది. ఆర్థిక వనరులు ఎలా స్వీకరించారు.. ఇంత భారీ స్థాయిలో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది… ఎందుకోసం తెచ్చిన అప్పు ఇది… ఆ ప్రయోజనం కోసమే వినియోగించారా అనేది చెప్పలేదు. ఒక రోడ్డు, ఒక ఆసుపత్రి బాగుపడ్డాయా? ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు.

• దౌర్జన్యంతో ఎంతకాలం పాలన సాగిస్తారు?
ఉద్యోగులను భయపెడుతున్నట్లే – అందరిపై దౌర్జన్యంతో పాలన సాగిస్తున్నారు. రండి చూద్దాం ఎంతమందిపై కేసులుపెడతారో… ఈ పాలన ఎంత కాలం సాగుతుందో చూద్దాం. ఈ ముఖ్యమంత్రే ఏళ్ల తరబడి ఉండిపోతాను అనుకొంటున్నారేమో? పోలీసు అధికారులు విధుల్లో ఉంటే మంత్రి చొక్కా పట్టుకొంటే ఏం చేయాలి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్ళు హుందాగా ఉండాలి. అది లోపించింది.

• మోసపోయామన్న భావనలో మత్స్యకారులున్నారు

పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు, చేసిన వాగ్ధానాలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా హామీలు నెరవేరకపోవడంతో మత్స్యకారులు మోసపోయామనే భావనలో ఉన్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తుంటే ప్రతి మహిళ ఇదే చెబుతున్నారు. తీరప్రాంత పల్లెల్లో కనీసం మంచినీటి సదుపాయం లేదు. కరెంటు లేదు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. మత్స్యకార గ్రామాలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయి.

• ఒక్క వైసీపీ కార్యకర్తకైనా బీమా కల్పించారా?

యువతకు ఉపాధి లేక వలసలు పోతున్నారు. అర్హులైన చాలా మందికి మత్స్యకార భరోసా అందడం లేదు. వేటకు వెళ్లి చనిపోతే రూ.10 లక్షలు ఇస్తామన్న హామీ కూడా ఎక్కడా నెరవేరడం లేదు. నిడదవోలు, అత్తిలిలో క్రియాశీలక జనసైనికులు ఇద్దరు ఇటీవల చనిపోతే వారికి చెరో రూ. 5 లక్షలు చొప్పున పవన్ కళ్యాణ్ భిమా అందించారు. అధికారంలో లేకపోయినా ఆయన అంత చేస్తుంటే… అధికారంలో ఉండి మీరు ఎంత చేయాలి? కనీసం చనిపోయిన ఒక్క వైసీపీ కార్యకర్తకైనా బీమా కల్పించారా? అక్కడే తెలుస్తున్నాయి… మీ నాయకత్వ లక్షణాలు. ఇంకెంత కాలం అధికార యంత్రాంగం, వైసీపీ మనుషులను అడ్డుపెట్టుకొని భయపెట్టి పాలన చేస్తారు. ఇకపై అది చెల్లదు. జీవో నెం. 217ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 217తో సుమారు 4.5 లక్షల మంది మత్సకారుల ఉనికి, ఉపాధి ప్రమాదంలో పడనుంది. వందల ఎకరాల చెరువులు ఉన్న బడా ఆసాములే వాటి హక్కులు దక్కించుకుంటారు. మత్స్య సంపద మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్య్సకారుల జీవితాలు అన్యాయం అయిపోతాయి.

• గంటల వ్యవధిలోనే 500 కాల్స్ వచ్చాయి

మత్స్యకారులు తమకు జరిగిన అన్యాయం, ప్రభుత్వం చేసిన మోసం గురించి చెప్పాలనుకుంటే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండని జనసేన పార్టీ నిన్న సాయంత్రం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే గంటల వ్యవధిలోనే 500 కాల్స్ వచ్చాయి. అర్హులైన వారిని ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో వివరించారు. వారు చెప్పిన సమాచారాన్ని, మేము అధ్యయనం చేసిన విషయాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ నెల 20న నరసాపురంలో జరిగే బహిరంగ సభలో వాటి గురించి ప్రస్తవిస్తారు. అలాగే ఆ సమస్యలపై పార్టీ స్టాండును వివరిస్తామని చెప్పారు.

• క్రియాశీలక కార్యకర్తలకు రూ.5 లక్షల బీమా

ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. నిడదవోలు నియోజకవర్గం వడ్లూరు గ్రామానికి చెందిన మేడపాటి దుర్గాప్రసాద్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. దుర్గాప్రసాద్ తల్లి శ్రీమతి కొండమ్మ, తమ్ముడు శ్రీ వీర రాఘవతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రూ.5 లక్షల బీమా చెక్ అందజేశారు. తణుకు నియోజకవర్గం అత్తిలికి చెందిన శ్రీ బత్తుల ఉమాకుమార్ ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉమాకుమార్ భార్య శ్రీమతి స్వాతి, తల్లితండ్రులు శ్రీమతి పోలేశ్వరి, సత్యనారాయణలను ఓదార్చి రూ.5 లక్షల బీమా చెక్కును అందించారు. ఈ కార్యక్రమాల్లో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పి.ఏ.సి. సభ్యుడు చేగొండి సూర్యప్రకాశ్, తణుకు ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు, ఏలూరు ఇంచార్జ్ శ్రీ రెడ్డి అప్పల్నాయుడు, రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీమతి గంటసాల వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.