అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండానే హోటల్ నిర్వహణ

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను రమేష్‌ ఆస్పత్రి ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ కోవిడ్‌ కేంద్రానికి  తీసుకోవలసిన ఏ విధమైన అగ్నిమాపక అనుమతులు తీసుకోలేదు. హోటల్‌గా వినియోగిస్తున్నట్లయితే 15 మీటర్ల ఎత్తుకు నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) అనుమతులు తీసుకోవాలి. అదే కోవిడ్‌ సెంటర్‌కు కనీసం 9 మీటర్ల ఎత్తుకు అనుమతులు పొందాలి. కానీ, ఈ రెండు అనుమతులు తీసుకోలేదని సమాచారం. ఆ హోటల్‌ను కరోనా కేర్‌ సెంటర్‌గా నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ దృష్టికి కూడా తీసుకురాలేదు.

మంటలు తీవ్రతకు కారణం: గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రిసెప్షన్‌ ఉంది. దాని పక్కనే మెట్లు, లిఫ్ట్‌ ఉంది. రిసెప్షన్‌ నుంచే అన్ని గదులకు కేబుల్స్‌ ఉన్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌వల్ల కేబుల్స్‌లో అంతర్గతంగా (మౌల్డింగ్‌లో ఇంటర్నల్‌ కంబర్షన్‌) మంటలు వ్యాపించి ఉంటాయని అగ్నిమాపక అధికారి ఒకరు చెప్పారు. మంటలు బయటకు రాగానే ఆక్సిజన్‌తో కలిసి మంటలు ఒక్కసారిగా ఎగసిపడి ఉంటాయంటున్నారు. రిసెప్షన్‌ నుంచి రెండో అంతస్తు వరకు డూప్లెక్స్‌ తరహాలో అలంకరణకు చెక్కను బాగా వినియోగించడంవల్లే మంటలు తీవ్రంగా వ్యాప్తిచెందడానికి కారణమైంది.