మాస్కులు ధరించకపోతే భారీ జరిమానా

దేశ రాజధానిలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తోంది. సెకెండ్ వేవ్ ఆరంభమైందనే సంకేతాలను పంపిస్తోంది. దసరా, దీపావళి పండగ సీజన్‌ ముందు నుంచే ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు భౌతికదూరం పాటించడంతో విధిగా మాస్కులు ధరించాలని ఆయన ఢిల్లీ ప్రజలకు సూచించారు. మాస్కులు ధరించకపోతే రూ.2వేల జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. కారులో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని ఆయన చెప్పారు. ఢిల్లీలో పెద్దఎత్తున కరోనా పరీక్షలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగుల కోసం ప్రభుత్వం కేటాయించిన 60 శాతం పడకలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో గూమికూడవద్దని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల మద్ధతు అవసరమని ఆయన తెలిపారు.