భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ టూర్‌తో హైదరాబాద్‌లో హైటెన్షన్ నెలకొంది. వరదసాయం నిలిపివేయాలంటూ ఈసీకి లేఖ రాసినట్లుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన సంజయ్… దానిపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈసీకి తాను లేఖ రాయలేదని అమ్మవారిపై ప్రమాణం చేస్తానని… కేసీఆర్ కూడా ఆయన చెప్పేది నిజమైతే అమ్మవారిపై ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన విధంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్‌ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. వరద సాయంపై ఎస్‌ఈసీకి లేఖరాసినట్టు అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. నకిలీ లెటర్‌హెడ్‌, సంతకం ఫోర్జరీ చేశారని పేర్కొన్నారు. బండి సంజయ్‌తో పాటు భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున చార్మినార్‌ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.