వదలను ముందునేనే కోర్టుకువెళ్తా: కొరటాల శివ

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్ర కథ, రాజేష్ మండూరి కథ ఒకటి కాదని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు. అతను చెబుతున్న కథ వేరని తన కథ వేరని ఆయన అన్నారు. అతను ఆ కథతో సినిమా తీసుకోవచ్చని సూచించారు.

కాపీ ఆరోపణలు, కాంట్రవర్సీపై కొరటాల శివ మండిపడ్డారు. గురువారం రాత్రి ఒక న్యూస్ ఛానల్ నిర్వహించిన లైవ్ లో ఆయన మాట్లాడారు. రాజేష్ వదిలేసిన ఈ వివాదాన్ని తాను వదలనని ఆయన అన్నారు. పెద్దది చేస్తానని చెప్పారు. రాజేష్ కంటే ముందు తానే కోర్టుకు వెళ్తానని తెలిపారు.

తన కథలో దేవాదాయశాఖ వంటివి లేవనీ, సినిమా చిత్రీకరణలో ఉండగా కథను ఎలా చెబుతాననీ కొరటాల శివ పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత తను చెప్పిన కథకు, రాజేష్ కథ దగ్గరగా ఉంటే అప్పుడు వివాదం చేయవచ్చని తెలిపారు. అసలు అతడి కథకు, తన కథకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాజేష్ ఆరోపిస్తున్నట్లు ‘ఆచార్య’లో ఉత్సవం మీద పాట గాని, ఉత్సవం సెట్లో ఫైట్ గాని తీయలేదని కొరటాల శివ అన్నారు. తనది తండ్రి కొడుకుల కథ కాదన్నారు. అతడు కోర్టుకు వెళ్లి కేసు వేసుకోవచ్చు అన్నారు. అలాగే తనకు కోర్టుకు వెళ్లే హక్కు ఉందన్నారు.