కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే.. అరెస్టులా?.. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జనసేనాని

ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది కాదని పవన్ హితవు పలికారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రఘురామ కృష్ణరాజు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను వాడుకోవడం దురదృష్ణకరమన్నారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అసహనానికి ఎంపీ అరెస్టు నిదర్శనమని మండిపడ్డారు.