ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, వేధింపులకు గురిచేస్తారా?: నాదెండ్ల మనోహర్

అమలాపురం జనసేన ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబును గృహనిర్బంధంలో ఉంచడంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, పాలకులు వేధింపు ధోరణులు అవలంబించడం అప్రజాస్వామికం అని విమర్శించారు. కోనసీమలో రోజుకు 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని, వైద్య వసతులు కల్పించాలని రాజబాబు డిమాండ్ చేస్తున్నారని నాదెండ్ల వివరించారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ రాజబాబు ఒక్కరే దీక్ష చేపట్టారని, అయినప్పటికీ ఆయనను గృహ నిర్బంధంలో ఉంచి, ఆయన వాహనాన్ని సీజ్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. రాజబాబు చేస్తున్న డిమాండ్ ఎంతో న్యాయబద్ధమైనదని, వెంటనే ఆయనను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని నాదెండ్ల స్పష్టం చేశారు.

కోనసీమలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ, కెయిర్న్, గెయిల్ వంటి చమురు సంస్థలు తమ సీఎస్సార్ నిధులతో వెంటనే వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తాము ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.