వ్యాక్సిన్ తీసుకుంటే.. లాటరీలో రూ.7.3 కోట్ల ప్రైజ్ మనీ.. ఎక్కడంటే?

మనదేశంలో కరోనా వ్యాక్సిన్ దొరక్క ప్రజలు అల్లాడుతుంటే, అమెరికాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. టీకాలు వేయించుకోవడానికి అమెరికా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు ప్రజలను తీసుకురావడంపై అమెరికా రాష్ట్రాలు వ్యూహరచన చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఓహియో రాష్ట్రం ఓ అడుగు ముందుకేసి భారీ లాటరీ ప్రకటించింది.

వ్యాక్సిన్ తీసుకున్న వారి పేర్లతో ప్రతివారం లక్కీ డ్రా తీయాలని నిర్ణయించింది. 18 ఏళ్లు నిండి, కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఈ లాటరీలో పాల్గొనేందుకు అర్హులు. విజేతకు రూ.7.3 కోట్లు అందజేస్తారు. ఈ మేరకు ఓహియో రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ఓ ప్రకటన చేశారు. తొలి వారం విజేతగా నిలిచే వ్యక్తికి తదుపరి వారం విజేతను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసే అవకాశం కల్పించారు.

ఇక, 17 ఏళ్ల లోపు వారికి మరో ఆఫర్ ప్రకటించారు. ఇందులో నగదు బహుమతి ఉండదు కానీ, విజేతకు ఏడాది పాటు స్కూల్ స్కాలర్ షిప్ చెల్లిస్తారు. ఇలాగైనా వ్యాక్సిన్లు తీసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తారన్నది ఓహియో పాలకవర్గం ఆశ.