అహ్మదాబాద్, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టులకు మోదీ భూమిపూజ

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్‌-2కు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భూమి పూజ చేశారు. ఇదే సమయంలో సూరత్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా ప్రారంభోత్సవం చేశారు. ఈ రెండు ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అహ్మదాబాద్‌లో నిర్మిస్తున్న మెట్రో రైలు రెండో ఫేజ్‌ పనులు అహ్మదాబాద్‌కు గొప్ప బహుమతి అని పేర్కొన్నారు. దేశంలోని రెండు ప్రధాన వ్యాపార కేంద్రాలైన అహ్మదాబాద్‌, సూరత్‌లకు మెట్రో కనెక్టివిటీ మరింత బలోపేతం చేస్తుందన్నారు.

మునుపటి ప్రభుత్వాల విధానం, ప్రస్తుత తమ ప్రభుత్వం పని మధ్య వ్యత్యాసాన్ని చూడటానికి ప్రధాన ఉదాహరణగా దేశవ్యాప్తంగా మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణను చెప్పుకోవచ్చునని పేర్కొన్నారు. ‘2014 కి ముందు 10-12 సంవత్సరాలలో 225 కిలోమీటర్ల మెట్రో లైన్ మాత్రమే ఏర్పాటుచేయగా.. గత ఆరేండ్లల్లో 450 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్ విస్తరించింది” అని ప్రధాని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్ పనులు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. తన ప్రభుత్వం నగరాల రవాణా వ్యవస్థను ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మాదిరిగా అభివృద్ధి చేస్తున్నదని, అంటే బస్సు, మెట్రో, రైలు తమ సొంత డిజైన్ ప్రకారం నడవవు, కానీ ఒకదానికొకటి పరిపూరకరమైన సమిష్టి వ్యవస్థగా పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవ్రాత్ తదితరులు హాజరయ్యారు.