ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్న భారతీయులు..

యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం వచ్చింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగున్నర నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఓటు వేసేలా సర్వం సిద్ధం చేశారు. మెయిల్‌, ముందస్తు ఓటింగ్‌ జోరుగా సాగింది. దాదాపు 9.8 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2016 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లలో మూడింట రెండు వంతుల ఓట్లు ఇప్పటికే పోలయ్యాయి కాగా ఇదో కొత్త రికార్డ్‌ కూడా.

అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ రోజు కన్నా ముందే ఇంత భారీ సంఖ్యలో అమెరికన్లు ఓటు వేయడం ఇదే మొదటిసారి. అయితే భారత సంతతి ఓటర్లు కూడా ఈసారి అత్యధిక సంఖ్యలో ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా.. చాలా వరకు ఓటర్లు ముందే ఓటేశారు. అబ్సెంట్ బ్యాలెట్‌గా పిలువబడే ముందస్తు ఓటింగ్‌ అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది. ఇవాళ జరిగే పోలింగ్‌లో ట్రంప్‌, బైడెన్ భవితవ్యం తేలనున్నది.

సాధారణంగా పూర్తి ఫలితాలు రావాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ పోలింగ్ జరిగిన మరుసటి రోజే దాదాపు విజేత ఎవరో ఖాయం అవుతుంది. 2016లో పోలింగ్ జరిగిన మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు డోనాల్డ్ ట్రంప్ విక్టరీ ప్రసంగం చేశారు. అయితే ఈసారి పూర్తి ఫలితాల ప్రకటన మాత్రం కొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెరగడం వల్ల.. వాటి లెక్కింపు ఆలస్యం అవుతుందని అధికారులు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.