షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు

ఎవరెన్ని విమర్శలు చేసినా..అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పరీక్షలు నిర్వహించేందుకే ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవల్సిందిగా మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.

ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని, మే 5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌  మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్‌ పరీక్షలు అనివార్యమని, కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ్టి నుంచి అంటే ఏప్రిల్ 29 సాయంత్రం 6 గంటల్నించి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని..దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని..గత ఏడాదితో పోలిస్తే అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా..అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషల్ అధికారిని నియమించి..పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేయిస్తామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేశామన్నారు.

ప్రతి సెంటర్‌లో ఒక పారా మెడికల్ సిబ్బందితో పాటు ఐసోలేషన్‌ రూమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్‌ రూమ్‌లో పరీక్ష రాయిస్తామని.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ జరుపుతున్నామన్నారు. అన్ని భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు.