మయన్మార్‌లో ఇంటర్నెట్ పునరుద్ధరణ

మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా యాంగూన్ నగరంలో ఆదివారం ప్రజాందోళనలు మిన్ను ముట్టడంతో మయన్మార్‌లో ఇంటర్నెట్ పునరుద్ధరణ అయింది. శనివారం ఇంటర్నెట్ సర్వీస్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. యాంగూన్ లోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు ఆందోళనలు ఆదివారం సాగాయి. నగరం నడిబొడ్డున ఉన్న సులె పగోడా వద్ద ఈ ఆందోళనలన్నీ చేరాయి. మదర్ సూ లాంగ్‌లివ్, మిలిటరీ నియంతృత్వాన్ని అణచివేయాలి అన్న నినాదాలు మిన్నుముట్టాయి. శనివారం అసమ్మతి పెరగడంతో పాలక వర్గాలు ఇంటర్నెట్ సర్వీస్‌లను రద్దు చేయించారు. దీంతో సమాచారాన్ని పూర్తిగా కట్టడి చేస్తున్నారన్న భయాందోళనలు పెల్లుబుకడంతో ప్రజాందోళనలు పెరిగాయి.

దీంతో ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మళ్లీ ఇంటర్నెట్ అనుసంధానం ప్రారంభమైంది. ఆదివారం యాంగూన్ యూనివర్శిటీ సమీపాన కార్మిక సంఘాలు, విద్యార్థులు దాదాపు 2000 మంది సమావేశమై ఆందోళన సాగించారు. మెయిన్ రోడ్డు మీదుగా పాదయాత్ర సాగించారు. ట్రాఫిక్‌ను దిగ్బంధం చేశారు.