అసలు రాష్ట్రంలో ప్రత్యేకించి సత్తెనపల్లిలో పోలీస్ వ్యవస్థ ఉందా? లా అండ్ ఆర్థర్ పనిచేస్తుందా?.. ఆళ్ళ హరి

గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ప్రత్యేకించి సత్తెనపల్లిలో పోలీస్ వ్యవస్థ ఉందా?.. లా అండ్ ఆర్థర్ పనిచేస్తుందా? అని ప్రశ్నించారు. తమ వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకొని వైసీపీ నేతల సేవలో పోలీసులు ఇంతలా తరించాలా?. పోలీసులు చదువుకున్న చదువుకి బయట అంతకన్నా ఎక్కువే సంపాదించుకోవచ్చు ఆత్మగౌరవంతో.. వృత్తికి న్యాయం చేయలేక వైసీపీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తలేక సామాన్య ప్రజలకు భద్రత కల్పించలేక క్షణక్షణం అనుక్షణం తమని తాము ఆత్మవంచన చేసుకొని విధులు నిర్వహించటం అవసరమా? ఈ రోజు ఉండి రేపు దిగిపోయే నేతల ప్రాపకం కోసం ప్రజల్ని, ఈ సమాజాన్ని ఇంతలా మోసం చేయటానికి పోలీసులకు (అందరూ కాదు) చేతులెలా వస్తున్నాయి… మనసెలా ఒప్పుతుంది. ప్రజల రేపటి కోసం తన నేటిని ఫణంగా పెట్టి విధులు నిర్వహించే పోలీసు నేడు వైసీపీ నాయకుల అన్యాయాలకు, దుర్మార్గాలకు, దాష్టీకాలకు వెన్ను కాయాల్సిరావటం కన్నా హేయం ఇంకోటి ఉంటుందా?.ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చినా? ఎంతటి ఆపద కలిగినా భగవంతుడు కన్నా ముందు గుర్తుకువచ్చే పోలీసు వ్యవస్థను నేడు తలుచుకోవాలంటేనే ఈసడించుకునే దుస్థితికి, ఈ వ్యవస్థలో తమకు న్యాయం జరగదు అనే అపాయకర పరిస్ధితికి ఎవరు తీసుకువచ్చారు.. ఈ పాపంలో ( కొంతమంది ) నేతల, పోలీసుల వాటా ఎంత?. ఇలా ఇంటా బయట విమర్శలు ఎదురుకుంటూ నిత్యం తమకి తాము ఆత్మవంచన చేసుకుంటూ ఈ వైసీపీ నేతల సేవలో తరించటానికి పోలీసులకు (అందరూ కాదు) సిగ్గు అనిపించడం లేదా?. న్యాయం చేయాల్సిన వారు.. భద్రత కల్పించాల్సిన వారు.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే.. నేతల చేతిలో కీలుబొమ్మలైతే ప్రజలకు ఇక దిక్కెవరు?. ఒక పోలీస్ అవటానికి ఎంతో కష్టపడి చదివి.. మరెంతో మేధోమధనం చేసి … ప్రజలకు, ఆపదలో ఉన్నవారికి న్యాయాన్ని, భద్రతను కల్పిస్తానని ప్రమాణం చేసిన ప్రతీ పోలీసు ముఖ్యంగా ఈ వైసీపీ నేతల అరాచకాలకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇప్పటికైనా.. మీరు చదివిన చదువుకు.. వృత్తిని చేపట్టే ముందు చేసిన ప్రమాణానికి సార్ధకత చేకూర్చండి. ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోకముందే మేలుకోండి.. ఈ సమాజాన్ని కాపాడండి. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతూ విధులు నిర్వహిస్తున్న ప్రతీ పోలీసు పాదాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆళ్ళ హరి అన్నరు.