రాజ్యాంగ హక్కులను కాలరాయడం పోలీసులకు తగదు

• పోలీసులు పౌరహక్కులను గౌరవించాలి
• జనసేన పార్టీ క్రమశిక్షణతో ప్రజా పోరాటాలు చేస్తుంది
• పోలీసులకు అన్నివిధాలా మేం సహకరిస్తాం.. మాకు వారి సహాయం అవసరం
• జన సైనికుడు శ్రీ కొట్టే సాయికి జరిగినట్లే రేపు మరొకరికి జరగదని భరోసా ఇవ్వాలి
• మీడియాతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• శ్రీకాళహస్తి ఒకటో పట్టణ సీఐ తీరుపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్

‘ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అది పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ప్రజలు తమ సమస్యల మీద, ప్రభుత్వ విధానాల మీద బహిరంగంగా తమ నిరసనను శాంతియుతంగా తెలియజేయొచ్చు. క్రమశిక్షణగా నిరసన తెలిపే ప్రజలకు పోలీసులు తగు విధమైన రక్షణ ఇవ్వాలి తప్ప, ఇష్టానుసారం దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేసే అధికారం లేద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జన సైనికుడు శ్రీ కొట్టే సాయి శాంతియుతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో… శ్రీకాళహస్తి ఒకటో పట్టణ సీఐ శ్రీమతి అంజూయాదవ్ విచక్షణారహితంగా ప్రవర్తించి, దాడి చేసిన ఘటనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. స్వయంగా సాయికి మద్దతుగా తానే పోలీసులతో మాట్లాడేందుకు వస్తానని ప్రకటించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. కొట్టే సాయి శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో సీఐ అంజూయాదవ్ చేసిన దాడి ఉపేక్షించరానిదని, ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి, తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రజాస్వామ్యంలో పోలీసులు రాజ్యానికి విధేయులుగా పనిచేయాలి తప్ప, పార్టీలకు కాదని విన్నవించారు. పోలీసులకు జనసేన పార్టీ పూర్తిగా అన్నివేళలా సహకరిస్తుందని చెప్పారు. పోలీసులు సైతం చట్టాలను, నిబంధనలు పాటించాలని ఎస్పీకి వివరించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎస్పీ హామీ ఇచ్చారు. ఇప్పటికే సీఐకు ఛార్జిమెమో ఇచ్చామని, ఆమె సమాధానం తర్వాత శాఖపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు.
వినతిప్రతం ఇచ్చిన అనంతరం ఢిల్లీ వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘‘ దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం పౌరులు స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు ఉందని పలు కేసుల్లో భాగంగా వ్యాఖ్యానించింది. న్యాయస్థానం చెప్పిన అంశాలను పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆచరించాలి. జనసేన మచిలీపట్నం ఆవిర్భావ సభకు సుమారు 6 నుంచి 7 లక్షల మంది హాజరైనా.. అంతా క్రమశిక్షణతో నడుచుకున్నారు. జాతీయ గీతం రాగానే అంతా క్రమశిక్షణతో లేచి నిలబడి, గౌరవం ఇచ్చారు. జన సైనికులు ఎక్కడైనా క్రమశిక్షణతో మెలుగుతారు. పోలీసులకు పూర్తిస్థాయి గౌరవం ఇస్తారు. పోలీసులు సైతం ప్రజా సమస్యలపై పోరాడే జనసేనకు తగిన విధంగా సహకరించాలి. అడ్డగోలుగా ప్రజా హక్కులను కాలరాస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈ రోజు కొట్టే సాయికి జరిగినట్లే, రేపు మరొకరికి జరగొచ్చు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా ఈ ఘటనపై వేగంగా స్పందించి, సుమోటోగా కేసు తీసుకోవడం హర్షించదగిన విషయం. బాధితుడికి తగిన విధంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. పోలీసులతో ప్రతిసారి మేం ఘర్షణ పడాలని భావించడం లేదు. వారికి అన్ని విధాలా పూర్తిస్థాయిలో జనసేన సహకరిస్తుంది. వారు సైతం జనసేన పార్టీకి తగిన విధంగా సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి, జి.రాందాస్ చౌదరి, కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.