మంత్రులందరికీ పవన్ కళ్యాణ్ ని తిట్టే శాఖ కేటాయించిన జగన్ రెడ్డి

  • జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, రాష్ట్రంలో ఉన్న మంత్రులకు తమ శాఖ ఏమిటో తమకే తెలియని స్థితిలో ఉన్నారని అయితే మంత్రులందిరికి మాత్రం పవన్ కళ్యాణ్ ని తిట్టే ప్రత్యేక శాఖను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేటాయించాడని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. విశాఖపట్నంలో నెలకొన్న పరిస్థితులపై కొంతమంది మంత్రులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు తన శాఖపై ఇంతవరకు ఒక్క సమీక్షా సమావేశం అన్నా నిర్వహించారా అని ప్రశ్నించారు. జలవనరుల శాఖని జల్సా శాఖగా మార్చిన అంబటి రాంబాబు పోలవరాన్ని పూర్తిగా మరచిపోయి పనికిమాలిన పనులన్నీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రం క్యాబినెట్ లో ఇంతకన్నా మగాడు ఇంకొకడు లేడన్నట్లు తగుదునమ్మా అని ప్రతీసారి పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ముందుకు వస్తున్నాడని ధ్వజమెత్తారు. అంబటి చిట్టా మొత్తం జగన్ రెడ్డి గుప్పెట్లో ఉందని అందుకే బానిసగా మారి జనసేనపై విమర్శలు చేస్తున్నాడనన్నారు. రాజకీయంగా నిన్నకాక మొన్న కళ్ళు తెరిచిన గుడివాడ అమర్నాధ్ ఇప్పటికే మూడు పార్టీలు మారాడని విమర్శించారు. జనసేన పార్టీ గురించి, జనసైనికుల, వీరమహిళల గురించి మంత్రులు జాలిపడాల్సిన పనిలేదని, 2024 తరువాత మీ పరిస్థితి ఏమిటో తలుచుకొంటుంటే మాకు మీమీద జాలి కలుగుతుందని ఎద్దేవా చేశారు. మంత్రి జోగి రమేష్ సన్నాసి మాటలు మానుకోవాలని హితవు పలికారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడని విమర్శిస్తున్నారని, ప్యాకేజీ తీసుకునే విషయంలో ఈ మంత్రులు ఏమన్నా బ్రోకరేజ్ చేశారా అని అన్నారు. రాష్ట్ర మంత్రులు మొత్తం బఫూన్ ల మాదిరి తయారయ్యారని దుయ్యబట్టారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు తమ బాధ్యతలను మరచి వైసీపీ నేతలకు కొమ్ముకాయటం కరెక్ట్ కాదన్నారు. పోలీసులు ఆత్మసాక్షిగా విధులు నిర్వర్తించాలని, జనసేనకు పోలీసులపై విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా ఉపాధక్ష్యురాలు బిట్రగుంట మల్లిక మాట్లాడుతూ విమానాశ్రయంలో మంత్రి రోజా వ్యవహరించిన తీరు మహిళాలోకానికే సిగ్గుచేటన్నారు. రోజా జనసైనికులని ఎంత రెచ్చకొట్టినా సంయమనం పాటించారని అయినా జరగని దాడిపై 307 కేసులు పెట్టించటం దుర్మార్గమన్నారు. రోజా మాట్లాడుతున్న మాటలు, వ్యవహరిస్తున్న తీరుతో రాజకీయాల్లోకి రావాలంటేనే మహిళలు వెనకడుగువేస్తున్నారని మల్లిక ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ఉపాధ్యక్ష్యులు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, నాగేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు, తన్నీరు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.