కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

కాంట్రాక్ట్ లెక్చరర్లకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్త అందించింది. జీతాల సమస్య నుంచి తమకు పరిష్కారం చూపాలని కోరిన ఏపీలోని ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఊరట కలిగించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి మేరకు ఇప్పటివరకూ అందుకుంటున్న 10 నెలల జీతాన్ని 12 నెలలకు పెంచుతూ ఆదివారం సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏడాదిపాటు ప్రతినెలా జీతాలను కాంట్రాక్ట్ లెక్చరర్ల కు అందించేలా త్వరలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నిర్ణయంతో ఏపీలోని 5,042 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ప్రైవేట్ ఓరియంటల్, ప్రభుత్వం ఒకేషనల్ కళాశాలల్లో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇకనుంచి 12 నెలలపాటు జీతం అందనుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి మేరకు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.