జనసేన నాయకుడిపై హత్యాయత్నంకు పాల్పడినవారిని క‌ఠినంగా శిక్షించాలి: పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌, ఓట‌మి భ‌యంతో వైసీసీ నాయ‌కులు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై భౌతిక దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, రానున్న రోజుల్లో వైసీపీ గుండాలకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు. శ‌నివారం ఆయ‌న నివాసంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో దుర్గి మండలం, మించాలపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు పసుపులేటి ప్రసాదు, పసుపులేటి హనుమంతరావు, సింగంశెట్టి మధు, దాసరి చెన్నయ్యల‌పై దారి కాచి వైసీపీ వ‌ర్గీయులు హత్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌ను బాలాజీ తీవ్రంగా ఖండించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ మీ అంతు చూస్తాం.. చంపేస్తాం.. అంటూ గాయాలు పైకి కనపడకుండా పిడిగుద్దులు గుప్పించారు. నలుగురు జనసేన నేతలను దారుణంగా చితకబాదారు. గొడ్డళ్లతో కారును ధ్వంసం చేశారని వివ‌రించారు. చిల‌క‌లూరిపేట స‌భ‌కు వెళ్లిరావ‌డం, ఉమ్మ‌డి అభ్య‌ర్ధి గెలుపు కోసం ప్ర‌చారం చేస్తున్నార‌న్న క‌సితో ఇటువంటి దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది అధికార వైసీపీలో అభ‌ద్ర‌తాభావం పెరిగిపోయింద‌ని, ఓట‌మి త‌ప్ప‌ద‌ని నిరాశ‌తో ప్ర‌తిప‌క్షాల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. మ‌రోవైపు టీడీపీ కడప అసెంబ్లీ అభ్యర్థి రెడ్డెప్ప మాధవిని గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా చాలా ప్రాంతాల్లో వైసీపీ జెండాలు, సిద్ధం పోస్టర్లు, జెండా దిమ్మెలకు రంగులను తొలగించకుండా అలాగే ఉంచిన విష‌యాన్ని ఫొటోలు తీస్తే, ఆమె కారుపై దాడిచేసి నడిరోడ్డుపై దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు ఎటువంటి సంకేతాలు అందిస్తాయో వైసీపీ ఆలోచించుకోవాల‌ని సూచించారు. ప్ర‌శ్నిస్తే దాడులు, త‌మ పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తే హ‌త్యాయ‌త్నమా…? అస‌లు ప్ర‌జాస్వామ్య‌ వ్య‌వ‌స్థ‌లో ఉన్నామా అని ప్ర‌శ్నించారు. ఇటువంటి సంఘ‌ట‌నలు పున‌రావృత‌మైతే స‌హించేది లేద‌న్నారు. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ గతిని మార్చ‌నున్నాయ‌ని, ఈ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి కూట‌మి పోరాడుతున్నది అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపుని నమ్ముకున్న పార్టీతో అన్న విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ అధినేత గ‌తంలోనే స్ప‌ష్టం చేశార‌ని గుర్తు చేశారు. అధికారులు ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.