జనసేవ లో జనసేన – రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించుకుండా రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. జనసేనాని పిలుపును అందుకున్న జనసైనికులు,ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, నార్మల్ వెంటిలేటర్‌తో కూడిన యూనిట్లను అందజేస్తున్నారు. ఈ మేరకు గురువారం జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

కరోనా బారి నుండి బాధితుల ప్రాణాలు కాపాడేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్లు, నార్మల్‌ వెంటిలేటర్‌తో కూడిన యూనిట్లను జనసేన పార్టీ శ్రేణులు పంపిణీ చేశాయి. శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు అందించిన సేవాస్ఫూర్తి ఈ కార్యక్రమంలో ప్రతిఫలించింది. 13 జిల్లాల్లో మొత్తం 335 యూనిట్లను జనసేన పార్టీ సమకూర్చింది. గురువారం ఆయా జిల్లా కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ కోవిడ్‌ ఆసుపత్రులకు ఈ యూనిట్లను అందచేశాయి.

విపత్కర పరిస్థితుల్లో వేడుకలకు దూరంగా… కోవిడ్‌ బాధితులకు అండగా ఉంటాం అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా జనసేన శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆయా జిల్లాల పార్టీ నాయకులు, జనసేన శ్రేణులతో పాటు ఎన్‌.ఆర్‌.ఐ. జనసేన విభాగం, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న జనసైనికులు కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ యూనిట్లు డొనేట్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం కోవిడ్‌ తో మృతి చెందిన వారికి రూ. 15 వేల పరిహారం ఇస్తే.. తాము కోవిడ్‌ బాధితులను బతికించేందుకు రూ. 10 వేలతో ప్రాణవాయువు అందిస్తామంటూ జనసేన నాయకులు నినదించారు” అని జనసేన పార్టీ తన ప్రకటనలో వెల్లడించింది.