Nellore: సోమశిల ముంపు బాధితులకు జనసేన నేతల పరామర్శ

వాయుగుండం కారణంగా కురుస్తున్న అకాల వర్షాలకు నెల్లూరులోని సోమశిల డ్యామ్ కు వరద పోటెత్తింది. ఒక్కసారిగా 5 లక్షల 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో నెల్లూరు నగర పరిధిలోని జనార్ధన్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కసారిగా ముంచుకు వచ్చిన ముంపుతో కనీసం విలువైన వస్తువులు సైతం బయటకు తెచ్చుకోలేకపోయారు. రాత్రికి రాత్రి రోడ్డున పడ్డ ముంపు బాధితులను జనసేన పార్టీ నాయకులు శ్రీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి పరామర్శించారు. పాలకుల అవగాహనా రాహిత్యంతో కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని వదిలేసి వందలాది మందిని రోడ్డున పడేశారని ఆరోపించారు. ఇళ్లు పూర్తిగా మునిగిపోవడంతో ఈ సారి భారీగా నష్టం వాటిల్లిందనీ, ప్రభుత్వం కనీసం పునరావాసం కూడా కల్పించలేదన్నారు. వరద బాధితుల కష్టాలను కళ్లారా చూసి, వారికి అండగా నిలిచేందుకు వచ్చినట్టు తెలిపారు. జోరు వానలో జనసేన నాయకులు బాధిత ప్రాంతాల్లో గంటల తరబడి పర్యటించి, క్షేత్ర స్థాయిలో వరద కష్టాలపై అధ్యయనం చేశారు.