నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై జనసేన పార్టీ ఆగ్రహం

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ అరవింద్‌ జనసేనతో జీహెచ్‌ఎంసీ, భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదని చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కోరడం వల్లే… తెలంగాణలో పోటీని జనసేన విరమించుకుని.. బీజేపీకి మద్దతు ఇచ్చిందన్న ఆ పార్టీ.. ఎంపీ అరవింద్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడింది జనసేన పార్టీ. ఎంపీ అరవింద్ వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. “జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండి. అంతే తప్ప జనసైనికులను రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడటం సరికాదు. ఎంపీ అరవింద్‌కు బీజేపీలో ఏం జరుగుతుందో తెలియదనుకుంట. అందుకే ఇలా పిచ్చి, పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ వ్యాఖ్యలను ఎంపీ అరవింద్‌ వెనక్కి తీసుకోవాలి” అంటూ జనసేన పేర్కొంది. కాగా.. గ్రేటర్‌ ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నామని జనసేన పార్టీ తెలిపిన విషయం విదితమే.