జనసేన పార్టీ దళిత మహిళా గ్రామ సర్పంచిపై దాడి అమానుషం: కందుల దుర్గేష్

పింఛన్లు పంపిణీలో రగడపై జనసేన ఫైర్
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఎస్సి ఎస్టి కేసు నమోదుకు డిమాండ్

తూర్పుగోదావరి జిల్లా కపీలేశ్వరపురం మండలంలోని వల్లూరులో పింఛన్లు పంపిణీ సమయంలో సర్పంచ్ దాసి మీనా కుమారిని దళిత మహిళ అని చూడకుండా దుర్భాషలాడటంను జనసేన నాయకులు ఖండించారు. తనను అవమానపర్చిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఫిర్యాదు చేసేందుకు అంగర పోలిస్ స్టేషన్ కు వెళితే అర్ధరాత్రి వరకు పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని విమర్శించారు. తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసులు నమోదులో పారదర్శకత చూపండని హితవు పలికారు. భాదితులు ఫిర్యాదు చేస్తే నమోదు చేయలేదని వేరే ఫిర్యాదుపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. వల్లూరులోని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్, వేగుళ్ళ లీలాకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు లు మాట్లాడుతూ వల్లూరు సర్పంచ్ గా దాసి మీనా కుమారి జనసేన నుండి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి గ్రామంలో చక్కని పాలన అందిస్తున్న క్రమంలో అధికార పార్టీ స్థానిక నాయకులు ఎస్సి మహిళ అనే వివక్ష చూపుతూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ వద్ద ఏర్పాటు చేయాల్సిన పింఛన్లు పంపిణీ కార్యక్రమం శివాలయం వద్ద ఏర్పాటుపై ఆమె అభ్యంతరం తెలియజేస్తే అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పింఛన్లు ఇక్కడే పంపిణీ చేస్తామని, దమ్ముంటే ఆపాలని, ఎవరేమి చేస్తారో చూస్తామని అవమానించారని విమర్శించారు. దళిత మహిళపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీనిపై న్యాయం చేయాలని ఫిర్యాదు చేసేందుకు అంగర పోలిస్ స్టేషన్ కు సర్పంచ్ వెళితే ఆమెను అక్కడ కూడా తీవ్రంగా అవమానానికి గురిచేసారని పేర్కొన్నారు. అప్పుడు ఆమె స్టేషన్ లో నెలపై బైటాయిస్తే ఫిర్యాదు తీసుకొని రసీదు ఇచ్చారన్నారు. ఈలోగా వేగుళ్ళ లీలాకృష్ణ, ఆయన తనయుడు రాజాలపై అక్రమంగా ఎస్ సి ఎస్ టి కేసు బనాయించారని తప్పుబట్టారు. వేరే వ్యక్తులు సర్పంచ్ కు అనుకూలంగా ఫిర్యాదు చేస్తే, అగ్రవర్ణాల పేరిట తూతూ మంత్రం కేసు నమోదు చేసారని విమర్శించారు. బాధితురాలు స్వయంగా వెళ్లి ఎమ్మెల్సీ పేరుతో ఫిర్యాదు ఇస్తే అది పక్కన పెట్టి థర్డ్ పార్టీ ఫిర్యాదుపై ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు. తక్షణమే సర్పంచ్ ఫిర్యాదుపై స్పందించి ఎమ్మెల్సీ తోటతో పాటు రుద్రయ్య చౌదరి, సతీష్ ఇతరులపై ఎస్సి, ఎస్టి కేసు నమోదు చేయాలని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో దళిత సర్పంచ్ కు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉదంతాన్ని అధినేత పవన్ కళ్యాణ్, పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకొని వెళ్ళమని చెప్పారు. సోమవారం జిల్లా ఎస్పిని కలిసి విజ్ఞప్తి చేస్తామని చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండపేట రూరల్ జనసేన అధ్యక్షుడు కుంచె దుర్గా ప్రసాద్, కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, రామచంద్రపురం ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, నాయకులు తాళ్ళడేవిడ్, సరాకుల అబ్బులు, వల్లూరి సత్యప్రసాద్, ఉండమట్ల రామారావు, గొల్లపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.