తిరుపతిలో ఘనంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

• సర్పంచి నుంచి ఎమ్మెల్యేగా సేవ చేసి ప్రజల మన్నలను పొందాను
• తిరుపతి పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని పవన్ ఆదేశించారు.
• భూమన చేసిన అభివృద్ధి దొంగ ఓట్లను చేర్చడమే.
• నాకు ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతా

  • ఆరణి శ్రీనివాసులు

తిరుపతి సిటీ, తిరుపతిలో బుధవారం జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, టీడిపి నగర అధ్యక్షుడు చిన్నబాబు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు మరియు మూడు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ.. తిరుపతిలో స్థానిక ఎన్నికల తరహాలో, సార్వత్రిక ఎన్నికలు కూడా నిర్వహించి గెలవాలని వైసిపి ప్రయత్నం చేస్తుందని, మీ ఆటలు సాగవని, ప్రజలు కూటమి వైపే ఉన్నారన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని స్పష్టం చేశారు.

బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో బీజేపీ, జనసేన, టీడిపి కూటమి గేలిచిందని గుర్తు చేశారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో కూడా ఈ కూటమికే పట్టం కడుతారన్నారు. కమిషన్ పేరుతో ఎమ్మెల్యే టీటీడీ నిధుల్లో నుంచి 200 కోట్లు కొట్టేసారని విమర్శించారు. వారి స్వస్థలాన్ని విడిచి ప్రధాని మోదీ గుజరాత్ నుంచి, చంద్రబాబు కుప్పం నుంచి, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని.. వారికి లేని అభ్యంతరం ఆరణి శ్రీనివాసులుకు ఒక్కడినే ఎందుకు అంటగడుతున్నారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

టిడిపి నేత నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. కూటమిపై ప్రజలు నమ్మకం పెట్టాలని, ఆరణి శ్రీనివాసులు ప్రజా సేవ చేసే వ్యక్తి అని, వరప్రసాద్, శ్రీనివాసులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, తిరుపతిలో కుటుంబ పాలనను తరిమికొడదామాని, కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు.

కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ.. తాను ప్రజాసేవకే అంకితమయ్యానని, నన్ను వైసీపీలో తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గానికే సీఎం పెద్దపీట వేశారని, నేను దళితుడను కాబట్టే నన్ను జగన్ చిన్నచూపు చూశాడన్నారు. జగన్ చుట్టూ రెడ్డి వర్గానికి చెందిన వారే ఉన్నారని, బీసీ ఎస్సీ ఎస్టీలకు వైసీపీలో సముచిత న్యాయం కల్పించలేదన్నారు. జగన్ మూర్ఖుడని, తిరుపతిలో స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని, అవినీతి రాజకీయాలు మనకు వద్దని, ఈసారి కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నన్ను, శ్రీనివాసులను గెలిపించాలని, తాము అందరికీ అందుబాటులో ఉంటామని ప్రజలను అభ్యర్థించారు.

తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాను సర్పంచి నుంచి ఎమ్మెల్యేగా సేవ చేసి ప్రజల మన్నలను పొందానని, తిరుపతి పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని మా అధినేత పవన కళ్యాణ్ తనను ఆదేశించారని, భూమన తిరుపతిలో చేసిన అభివృద్ధి దొంగ ఓట్లను చేర్చడం ఒకటేనని, తిరుపతిలో చేసిన అభివృద్ధి శూన్యమని, పెద్ద ఎత్తున టిడిఆర్ బాండ్లలో అవినీతికి భూమున పాల్పడ్డారన్నారు. నన్ను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అండగా ఉంటానని, నాకు ఒక అవకాశం ఇస్తే గతంలో ఎన్నడూ దీని విధంగా తిరుపతిలో అభివృద్ధిని చేసి చూపుతానని ఆయన స్పష్టం చేశారు. దళితుడను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ లాంటి పార్టీలు మనకొద్దని వ్యక్తం చేశారు. తిరుపతిలో వైసీపీ రౌడీయిజం, దౌర్జన్యాలు పోవాలంటే ప్రజలు జనసేన, టీడిపి, బిజెపి కూటమినే గెలిపించాలని, నాకు ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతానని శ్రీనివాసులు కోరారు. ఈ కూటమిలో అందరూ కలిసి పని చేద్దామని, ఎక్కడైనా చిన్న వేదాభిప్రాయాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామని, ప్రతి ఒక్కరికి తాను అందుబాటులో ఉంటానని, ముడు పార్టీల నేతలు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి-బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.