జనసేన – టీడీపీ పొత్తు చారిత్రక అవసరం

• పొత్తు ప్రకటించిననాడే వైసీపీ ఓటమి ఖాయమైపోయింది
• వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపమే
• రివర్స్ పాలనతో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాడు
• ఆర్ధిక రాజధాని విశాఖను.. గంజాయి రాజధానిగా మార్చాడు
• మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశాడు
• వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న శ్రీ పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
• రాష్ట్ర భవిష్యత్తు కోసమే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదం
• త్వరలో అమరావతి, తిరుపతిల్లో ఉమ్మడి సభలు
• యువగళం – నవశకం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే, అంతా కంటి నిండా నిద్ర పోవాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే, ఆస్తులు, ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణ ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయమైపోయిందన్నారు. జనసేన – టీడీపీ పొత్తు చారిత్రక అవసరమని, పొత్తు ప్రకటించిననాడే వైసీపీ పని అయిపోయిందన్నారు. అప్పటి నుంచీ వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో మైత్రికి ఆమోదం తెలిపిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వైసీపీ విముక్త రాష్ట్రం ఉండాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరినట్టు తెలిపారు. విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామం వద్ద జరిగిన యువగళం ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడుగారు మాట్లాడుతూ ‘‘భారత దేశంలో పాదయాత్రలు చేయడం కొత్తకాదు. నేను కూడా పాదయాత్ర, బస్సు యాత్ర చేశా. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మొదటిసారి ఎన్టీఆర్‌ గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పాదయాత్రలు చూశా. కానీ, ఎప్పుడూ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవు. మొదటిసారిగా సైకో జగన్‌ పాలనలోనే ఇలాంటి ఘటనలు చూశాం. ఒక పవిత్రమైన భావనతో పాదయాత్ర చేస్తున్నప్పుడు చేతనైతే సహకరించాలి.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి. కానీ, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. యువగళం వాలంటీర్లను జైలుకు పంపారు. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. యువగళం.. ప్రజాగర్జనకు నాంది పలికింది. ప్రజల్లో ఉండే బాధ, ఆక్రోశం, ఆగ్రహం యువగళంలో చూపించారు.
• ఒక్క హామీ నెరవేర్చలేదు
ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిన ఏ ఒక్క పని చేయలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏటా జనవరిలో ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇప్పటికి ఐదు జనవరిలు పూర్తయ్యాయి. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉన్న పరిశ్రమలు పోయాయి. కొత్త పరిశ్రమలు వచ్చింది లేదు. యువత జీవితాలు నాశనం చేసే పరిస్థితి తెచ్చారు. ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో యువతను అధ:పాతాళంలోకి నెట్టేశారు. వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు. వచ్చిన పరిశ్రమల్ని తరిమేశారు. జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం యువతకు అండగా ఉంటుంది. యువత భవితకు భరోసా ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది.
• వైకాపా నేతల కబ్జాలతో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది..
సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. రాష్ట్రం కోసం సేవలు చేసిన వారిని చూశాను. రాజకీయాల్లో రాజకీయ పరమైన వ్యతిరేకత తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వైకాపా నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. మెడపై కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఒకప్పుడు విశాఖ ఆర్థిక రాజధాని.. ఇప్పుడు గంజాయి రాజధానిగా మారింది. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగింది.. కబ్జాలు పెరిగాయి. మంచి చేస్తే ఆ ఫలితాలు అందరికీ వస్తాయి. చెడు చేస్తే దాని వల్ల అందరికీ నష్టం వస్తుంది. అదే ఈరోజు జగన్‌రెడ్డి చేసే పని. ఒక్కఛాన్స్‌ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. విధ్వంస పాలనకు జగన్‌ నాంది పలికారు. వైకాపా పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయి. రుషికొండను బోడిగుండు చేసి.. సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారు? అమరావతిని సర్వనాశనం చేసి మూడుముక్కలాట ఆడారు. తెదేపా అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లం. భోగాపురంలో విమానాశ్రయానికి నాడు పునాది వేశాం. టీడీపీ అధికారంలో ఉంటే అది కూడా 2020 నాటికి అందుబాటులోకి వచ్చేది. ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన చేసి ఏదో సాధించేశామని కబుర్లు చెబుతున్నాడు. అబద్ధాల పునాదులపై నిర్మించిన పార్టీ వైకాపా. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారాలి. రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు విజ్నప్తి చేస్తున్నా. ఈ పొత్తు జనసేన – టీడీపీ కోసం కాదు.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం అని బలంగా చెబుతున్నాం. ఈ ముఖ్యమంత్రి రివర్స్ పాలన పేరిట విధ్వంసానికి నాంది పలికాడు. నిరంతరం కక్ష సాధింపులు, ధ్వంస రచన మినహా మంచి చేయడం చేతకాని వ్యక్తి. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. హైదరాబాద్ తో సమంగా ఉండాల్సిన అమరావతి జగన్ దాష్టికాలకు బలయ్యింది. అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు మద్దతు ఇచ్చారు. అమరావతి రాజధానిగా, విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందని చెప్పా. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మూడు ముక్కలాట ఆడి అమరావతిని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు విశాఖ రాకముందే రుషికొండకు గుండు కొట్టి రూ. 500 కోట్లతో విలాసవంతమైన విల్లా కట్టకున్నాడు. అటు అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. విద్య, వైద్యం, వ్యవస్థలు మొత్తం భ్రష్టుపట్టి పోయాయి.
• అబద్దాల పునాదుల మీద నిర్మితమైన పార్టీ వైసీపీ
వైసీపీ అబద్దాల పునాది మీద నిర్మాణం చేసిన పార్టీ. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పాడు. సాధించలేదు. రైల్వే జోన్ సాధిస్తామన్నారు. మద్యపాన నిషేధం అన్నారు. ఇప్పుడు ఆ మద్యపానం పై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తాన్నారు. బాబాయ్ హత్యను వేరే వారి మీద వేసి సీబీఐ విచారణ కావాలని ఈ రోజున అసలు నిందితుల్ని తప్పించేందుకు పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి అన్ని ధరలు పెరిగిపోయాయి. అన్నింటా బాదుడే బాదుడు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇబ్బందుల పాలయ్యారు. ఆవేదనతో ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, వేధింపులు. చివరికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేశారు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం వస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది.
• మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..
త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి.. తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించాం. మహాశక్తి ద్వారా 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు రూ. 15 వేల ఆర్ధిక సాయం చేస్తాం. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలకు ఏటా రూ. 15 వేలు ఇస్తాం. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందచేస్తాం. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటా. అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేస్తాం. అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటాం. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తాం. భవిష్యత్‌లో ఏయే కార్యక్రమాలు చేయాలనే దానిపై అధ్యయనం చేస్తాం.
• మార్చాల్సింది ముఖ్యమంత్రిని
రాష్ట్రంలో మరో వింత తంతు జరుగుతోంది. ఎమ్మార్వోల మాదిరి ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. ఐదేళ్లు పని చేసిన వారిని ఇంకో నియోజకవర్గానికి పంపుతున్నారు. అసలు మార్చాల్సింది ఎమ్మెల్యేలను, మంత్రులను కాదు ఈ ముఖ్యమంత్రిని మార్చాలి. రాజకీయాలకు ఏ మాత్రం అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి విచిత్రమైన నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా అది రాష్ట్రానికి శాపంగా మారుతుంది. గత ఐదేళ్లుగా విధ్వంసం ఏంటో చేసి చూపాడు జగన్. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. జనసేన – టీడీపీకి ఓటు వేస్తారు అంటే వారి ఓట్లు తొలగిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని సంఘటనలు మన రాష్ట్రంలో జరగడం బాధాకరం. యువత ఓటు నమోదు చేసుకోండి. ఓటు మీ జీవితాలనే కాక రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తుంది. మీరు ఒక్క అడుగు వేస్తే మేము వంద అడుగులు వేస్తాం. వంద త్యాగాలు చేసి రాష్ట్రాన్ని పైకి తెస్తాం” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *