Atmakuru: సోమశిల జలాశయాన్ని సందర్శించిన జనసేన

ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ స్థానిక జనసైనికులతో కలిసి, సోమశిల జలాశయం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పరిపాలన అంటే, ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టి, లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి, నవరత్నాల పేరుతో వారికి పంచి, తమ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడమే అనుకుంటుంది. ఈ క్రమంలో ప్రజల ఆధునిక దేవాలయాలు అయిన, నీటి పారుదల జలాశయాల భద్రతను గాలికొదిలేసింది. ఫలితంగా గత సంవత్సరం, పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకొని పోయి అపార నష్టం వాటిల్లింది. ఈ సంవత్సరం కడప జిల్లాలోని పించప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయి అపారమైన ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించిన సంగతి అందరికీ తెలిసినదే. గత సంవత్సరం వచ్చిన వరదలకు సోమశిల జలాశయం ముందు భాగంలో 30 అడుగుల గోతులు పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ గోతులను పరిశీలించిన డాన్స్ సేఫ్టీ రివ్యూ కమిటీ, ఈ గోతులను వెంటనే పూడ్చకపోతే జలాశయ ప్రధాన కట్టడానికి ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఈ నివేదికను బుట్టదాఖలు చేసి, దెబ్బతిన్న జలాశయ భాగాలకు మరమ్మతు చేయలేదు. జనసేన పార్టీ చాలా సందర్భాల్లో, ఈ విషయమై ధర్నాలు చేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి, ప్రజల ధన, మాన, ప్రాణాలను గాలికి వదిలేయడం జరిగింది. ప్రస్తుతం సోమశిల జలాశయంకి వస్తున్న, భారీ వరద కారణంగా, 5 లక్షల 30 వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయం నుండి విడుదల చేయడం జరిగింది. ఫలితంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, సంగం మండలాలకు చెందిన అనేక గ్రామాలు నీట మునగడమే, కాకుండా అపారమైన ఆస్తి నష్టం సంభవించడం జరిగింది. వేరుశెనగ, వరి తదితర పంటలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు వరదల కారణంగా కొట్టుకొని పోవడం జరిగింది. ప్రజలు తాగేందుకు నీరు లేక, తినేందుకు తిండి లేక, ఉండేందుకు గూడు లేక నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారికి అనుకూలంగా ఓటు వేయించుకోవడం మాత్రమే కాకుండా, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండేందుకు కూడా ఈ వ్యవస్థను ఉపయోగించవలసినదిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దెబ్బతిన్న ప్రతి ఇంటికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుందని తెలిపారు.