అంతర్వేది ఘటనపై స్పందించిన జనసేనాని

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధం ఘటనపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని జనసేన అధినేత డిమాండ్‌ చేశారు. పూర్తి అధికారం ఉన్న వైకాపా ప్రభుత్వం తీవ్రంగా స్పందించి దర్యాప్తు జరపకపోతే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఈ నేపధ్యంలో పవన్‌ కల్యాణ్‌ వీడియో సందేశాన్ని జనసేన పార్టీ విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంట, అంతర్వేదిలో జరిగిన ఘటనలు యాదృచ్ఛికాలు కావని పవన్‌ చెప్పారు. ఇలా ఎన్ని విగ్రహాల ధ్వంసాలు, రథాల దహనాలు యాదృచ్ఛికంగా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన మతిస్థిమితం లేని వారి పని.. తేనెపట్టు కోసం అలా చేశారంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతారని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇతర మతాల పెద్దలూ ఇలాంటి ఘటనలను ఖండించాలని కోరారు. ఎవరైనా ఉనికికోసం ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారా? దేశంలో అస్థిరత కోసం చేస్తున్నారా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలనన్నారు. ఉగ్రవాద కోణముంటే ఎన్‌ఐఏ దృష్టి సారించాలని పవన్ కోరారు.

పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసమైనపుడే రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించి ఉంటే అంతర్వేది తరహా ఘటనలు జరిగేవా? అని పవన్‌ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై ఆడపడుచులంతా మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలను ఎంత గౌరవిస్తామో హిందూ సమాజాన్నీ తమ పార్టీ అంతే గౌరవిస్తుందన్నారు. ఇన్ని కోట్ల మంది హిందువుల విశ్వాసాలు, మనోభావాలను పట్టించుకోకుండా ఉండటం సెక్యులరిజం అనుకోదన్నారు. హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని కచ్చితంగా ఆపాలని కోరారు. హిందూ విశ్వాసాలను వెనకేసుకొస్తే మతం అంటగడతారనే భయాలేమీ తమకు లేవని ఈ సందర్భంగా పవన్‌ వ్యాఖ్యానించారు. ఏపీలో చాలా చోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాని చెప్పారు. ఆస్తులపై ఆదాయం వస్తున్నా.. చాలా ఆలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పవన్ పేర్కొన్నారు.