మృత్యుకారులకు జనసేనాని భరోసా అభినందనీయం

విశాఖపట్నం హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లను కోల్పోయిన బాధితులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచి ఒక్కోక్క బోటు యజమానికి రూ 50 వేలు చొప్పున ఇవ్వడం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ సభ్యులు తిరుమాని సీతా మహాలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి వాతాడి కనకరాజు, మాజీ ఎంపిటిసి మైల వసంతరావు అన్నారు. ఆదివారం నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం, అగ్నికుల క్షత్రియ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖపట్నంలో జరిగిన బోట్ల ప్రమాదాన్ని జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ చైర్మన్, నర్సాపురం నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ సందర్శించి అక్కడ పరిస్థితిని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ బోట్లు కోల్పోయిన బాధిత యజమానులకు రూ 50 వేలు చొప్పున రూ 30 లక్షల ఆర్ధిక సాయాన్ని అందజేయడం పట్ల రాష్ట్రంలోని అగ్ని కుల క్షత్రియులు, మత్స్యకారులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడులేనని అన్నారు. గత తెదేపా ప్రభుత్వంలో మత్స్యకారులు వివిధ రూపాల్లో లబ్దిపొందారని అన్నారు. వైసిపి పాలనలో తమ సామాజిక వర్గంలోని వైసిపి నాయకులకు ఎందుకు పనికిరాని రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చి కూర్చోబెట్టడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ ని పేర్ని నాని విమర్శించడం తగదన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో నిత్యావసరాలు నుంచి మద్యం వరకు అత్యధిక రేట్లను పెంచి ప్రజలను వివిధ రూపాల్లో దోచుకుని డబ్బులు సంపాదిస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ కష్టపడి సంపాదించిన ధనాన్ని అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు ఇచ్చారు తప్ప వైసిపి నాయకులు మాదిరిగా ఎవరిని దోచుకుని ఇవ్వలేదని అన్నారు. సమావేశంలో పెమ్మాడి కిరణ్, కొల్లు జయరాజు, బొమ్మిడి కృష్ణమూర్తి, వాతాడి రమేష్,ఓలేటి దేవి ప్రసాద్, బొడ్డు త్రిమూర్తులు తదితరులు ఉన్నారు.