జగన్ రెడ్డి పాలన అంతమే జనసేన లక్ష్యం

ఏలూరు: రాష్ట్రంలో అరాచక జగన్ రెడ్డి పాలన అంతమే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఏలూరులోని గ్రాండ్ ఆర్య కాన్ఫరెన్స్ హాల్లో టిడిపి, జనసేన పార్టీల నాయకులు మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ టిడిపి, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ఈనెల 16వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు అమీనా పేటలోని టిడిపి జిల్లా కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జగన్ రెడ్డి రాక్షస పాలన అంతానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ రెడ్డి ధ్వంసం చేశాడని, ప్రజా సమస్యలను గాలికి వదిలివేసాడని, అభివృద్ధి పూర్తిగా కుంటిపడిందని, బడుగు బలహీన వర్గాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, విధ్వంసకర జగన్ రెడ్డి పాలనపై పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బివి రాఘవయ్య చౌదరి, ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబ్బిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, టిడిపి సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, తెలుగు యువత ఉపాధ్యక్షులు త్రిపర్న రాజేష్, జనసేన పార్టీ నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, వీరంకి పండు, సరిది రాజేష్, బొండా రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.