జంగారెడ్డిగూడెం కల్తీ సారా ఘటనపై న్యాయ విచారణ జరపాలి

• మరణాలన్నీ కల్తీ సారా తాగడం వల్లే సంభవించాయి
• సహజ మరణాలు అయితే పోస్టుమార్టం రిపోర్టు ఎక్కడ?
• ప్రభుత్వం బాధ్యత వహించాలి
• ప్రభుత్వ ప్రకటనలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి
• బాధిత కుటుంబాల తరఫున జనసేన పార్టీ పోరాటం చేస్తుంది
• అవసరమయితే న్యాయపోరాటానికి సిద్ధం
• కల్తీ సారా మృతుల కుటుంబాలను పరామర్శించిన నాదెండ్ల మనోహర్, కె.నాగబాబు

జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలన్నీ కల్తీ సారా తాగడం వల్ల సంభవించినవేనని, దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించినట్టు సహజ మరణాలు అయితే పోస్టుమార్టం రిపోర్టు ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్ట లేదని నిలదీశారు. శాసనసభలో సీఎమ్ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి మృతి చెందిన బాధిత కుటుంబాలను మంగళవారం సాయంత్రం పీఏసీ సభ్యులు కె.నాగబాబు గారితో కలసి పరామర్శించారు. మడిచర్ల అప్పారావు, షేక్ సుభానీ, ఉయ్యాల శ్రీను, బండారు శ్రీనివాస్, బంకూరి రాంబాబుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున 18 బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందచేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెంలో వారం రోజుల క్రితం జరిగిన పరిస్థితులపై క్షేత్ర స్థాయిలో అధ్యయనానికి పీఏసీ సభ్యులు నాగబాబు గారితో కలసి రావడం జరిగింది. ఇక్కడ నాటు సారా తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించి వారి వేదన రాష్ట్ర ప్రజానీకం దృష్టికి తీసుకురావడం వల్ల ప్రభుత్వంలో చలనం వస్తుందని, ఆ కుటుంబాలను ఆదుకుంటుందన్న నమ్మకంతో వచ్చాం. బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున భరోసా నింపడంతోపాటు భగవంతుడు వారి కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుండాలని, ఇబ్బందులు కలగకుండా కాపాడాలని కోరుకుంటున్నాను. అప్పారావు, శ్రీనివాసరావు, సుభానీ, రాంబాబుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించాం. మా బాధ్యతగా వారికి భరోసా నింపాం. అధైర్యపడవద్దని జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పాం.
* కలెక్టర్ గారు రమ్మంటున్నారు అని పిలిచి బెదిరించారు
బాధిత కుటుంబాలతో మాట్లాడినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. రాత్రి గం. 12 సమయంలో కూడా సుభానీ కుటుంబానికి ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు. నిన్న కలెక్టర్ గారు రమ్మన్నారని పిలిపించి ఎవరితోనూ నాటు సారా వల్ల చనిపోయారని చెప్పవద్దంటూ బెదిరించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే ఏం చేయాలి. ఈ ప్రభుత్వానికి సహజ మరణం అంటే తెలియదనుకుంటా. గతంలో ఏలూరులో ఇలాగే అంతుచిక్కని కారణంతో 20, 30 మంది చనిపోతే ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరిగితే అప్పుడూ ప్రభుత్వం ఇలాగే చేసింది. మున్సిపల్ సిబ్బంది నీటి సరఫరా మెయింటినెన్స్ సరిగా చేయకపోవడం వల్ల అంత మంది చనిపోయారు.
* బహిరంగంగా నాటు సారా అమ్ముతున్నారు
ప్రభుత్వం సంపాదన కోసం మద్యం ధరలు విపరీతంగా పెంచేసి అమ్మకాలు చేస్తుంది. కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చారు. అది ఏ బ్రాండో తెలియక భయపడి స్థానికంగా నాటు సారా తాగేసిన పరిస్థితి. జంగారెడ్డిగూడెంలో నాటు సారా అమ్మే దుకాణాలు 20 వరకు ఉన్నాయి అంటే మద్యం అమ్మకాలపై ఉన్న నియంత్రణ ఏ పాటిదో అర్ధం అవుతుంది. 20 షాపుల్లో పబ్లిక్ గా నాటు సారా అమ్ముతుంటే ప్రభుత్వ స్పందన ఈ విధంగా ఉంది. వీరికి ఏం చెప్పాలి. గతంలో విశాఖలో ఓ పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు హడావిడిగా అక్కడికి వెళ్లిపోయి ఆ కంపెనీ వాళ్లతో మాట్లాడి రూ. కోటి పరిహారం ప్రకటించారు. ఇక్కడ చూస్తే జంగారెడ్డిగూడెంలో మృతుల పోస్టుమార్టం రిపోర్టులు ఇప్పటి వరకు బయటపెట్టకపోగా, శాసనసభను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఓట్ల కోసం పని చేయడానికి ఇప్పుడే ఎన్నికలు లేవు కదా. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ తరఫున వారికి భరోసా ఇస్తాం. అది మా బాధ్యత.
* మీడియాపై నిందలు వేస్తున్నారు
మరణించిన వారు ఆసుపత్రి వరకు చేరిన పరిస్థితి లేదు. కడుపు నొప్పి, కళ్లు కనబడడం లేదని చెప్పిన రెండు గంటల్లోనే వారంతా మృతి చెందారు. అది సహజ మరణం ఎలా అవుతుంది. ఇలాంటి ప్రకటనలు చాలా తప్పు. ఇంత జరిగినా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు గానీ, కలెక్టర్ గాని రాలేదు. బాధ్యతగా మీరు వచ్చి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపండి. వారికి సహాయం అందించండి. ఆ కుటుంబాలకు కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు అవి. మావంతుగా జనసేన పార్టీ తరఫున 18 కుటుంబాలకు కొద్దిపాటి ఆర్ధిక సాయం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే అవసరం అయితే ఆ కుటుంబాలతో కలసి నిలబడి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. మీరు తప్పులు చేసి మీడియాపై దాడి చేస్తే ఏమొస్తుంది. మీడియా మీద నిందలు వేస్తున్నారు. అనుమానం ఉంటే విచారణ జరపాలి. అనవసరంగా ఎవరి మీదా నిందలు మోపొద్దు. జనసేన పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ఒకటే భరోసా ఇస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. అవసరం అయితే మీ కోసం న్యాయపోరాటం చేస్తాం. మీకు అండగా ఉంటాం. ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నానన్నారు.
• బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వదలిపెట్టం: కె.నాగబాబు
నాగబాబు గారు మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వమని ఆదేశించారు. ఆ కుటుంబాలను చూస్తే చాలా బాధ కలిగింది. మద్య నిషేధం అని చెప్పి పనికిమాలిన బ్రాండ్లతో సామాన్యుడి ఆరోగ్యాన్ని బలి తీసుకుంటుంది. ఇలాంటి ఘటన జరిగినప్పుడు బాధ్యుల్ని పట్టుకుని లోపల వెయ్యకపోగా సహజ మరణాలు అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడం కంటే దుర్మార్గం ఏముంది. సహజ మరణాలు అయితే మగవారు మాత్రమే చనిపోతారా? అదీ రెండు రోజుల్లో అంత మంది చనిపోతారా? స్పిరిట్ తో తయారు చేసే సారా తాగిన వారికి కళ్లు కనబడకపోవడం, పేగులు కాలిపోయినట్టు అవడం వంటి లక్షణాలు కనబడతాయి. బాధిత కుటుంబాలను పరామర్శించినప్పుడు వారు ఆ వివరాలు చెప్పారు. ప్రభుత్వం సహజ మరణాలు అని చెబుతోంది, మరీ అంత క్రూరత్వం పనికిరాదు. 30 మంది పైనే చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి. ప్రభుత్వం తాను చేసిన తప్పుకు, నియంత్రణ రాహిత్యానికి మూల్యం చెల్లించి తీరాలి. మద్యం ఆదాయంతోనే రాష్ట్రం బతుకుతోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కల్తీ సారా అనుమతించిన మీరు బాధ్యత వహించి తీరాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వదలం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పీఏసీ సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, చింతలపూడి నియోజకవర్గం ఇంఛార్జ్ మేకా ఈశ్వరయ్య, మత్స్యకార వికాస విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, బోడపాటి శివదత్, పార్టీ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, కరాటం సాయి, రెడ్డి అప్పలనాయుడు, విడివాడ రామచంద్రరావు, చిర్రి బాలరాజు, రవి, గుండా జయప్రకాష్, శ్రీమతి కాట్నం విశాలి, శ్రీమతి కడలి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.