‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది: ప్రభాస్‌

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న కామెడీ కేపర్ చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కెవి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశారు. ‘ట్రైలర్‌ అదిరిపోయింది. నాకు బాగా నచ్చింది. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా చిత్రయూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..” అని తెలుపుతూ.. ప్రభాస్‌ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇప్పటికే వచ్చిన పోస్టర్స్‌, టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచిన చిత్రయూనిట్‌ తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో.. సినిమా ఓ రేంజ్‌లో నవ్వించబోతుందనే విషయాన్ని తెలియజేశారు. ఆద్యంతం వినోదభరితంగా ఈ ట్రైలర్‌ను కట్‌ చేశారు. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ ముగ్గురే.. అనేలా ఒకరిని మించి ఒకరు ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్‌ చేశారనేది ట్రైలర్‌ చెప్పేస్తుంది. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న వస్తున్న ఈ ‘జాతిరత్నాలు’ చిత్రం మేటి చిత్రాల్లో ఒకటిగా నిలబడిపోతుందనేలా అప్పుడే ఇండస్ట్రీలో టాక్‌ కూడా మొదలైంది. చూద్దాం మార్చి 11న ఈ ‘జాతిరత్నాలు’ ఏం చేస్తారో?. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. సిద్దం మనోహర్ ఛాయాగ్రాహణం అందిస్తుండగా.. అభినవ్ రెడ్డి దండా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.