డిగ్రీ లేకపోయినా ఈ సర్టిఫికెట్ ఉన్నవారికి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు

గూగుల్ కెరీర్ సర్టిఫికెట్స్ ఉన్నవారిని నియమించుకునేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి 130 సంస్థలు గూగుల్ కెరీర్ సర్టిఫికెట్స్ ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎక్కువగా అమెరికాలో ఈ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇలాంటి సర్టిఫికెట్లను భారతదేశంలోని నిరుద్యోగులకు కూడా అందించేందుకు గూగుల్ కృషి చేస్తోందని ఇటీవల గూగుల్, ఆల్ఫబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ బ్లాగ్‌లో తెలిపారు. ఇన్ఫోసిస్ కూడా వచ్చే రెండేళ్లలో గూగుల్ కెరీర్ సర్టిఫికెట్స్ ఉన్న 500 మందిని అమెరికాలో నియమించుకోబోతున్నట్టు ప్రకటించింది. మెరిట్ అమెరికా భాగస్వామ్యంతో అందిస్తున్న ఈ కోర్సులు బ్యాచిలర్ డిగ్రీ లేనివాళ్లు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడుతుంది.

డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్ (UX) డిజైన్, అసోసియేట్ ఆండ్రాయిడ్ డెవలపర్ సర్టిఫికేషన్ లాంటి కోర్సులు పూర్తి చేసినవారికి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కోర్సులు పూర్తి చేసి గూగుల్ సర్టిఫికెట్ పొందినవాళ్లు ఇన్ఫోసిస్ మాత్రమే కాదు వాల్‌మార్ట్, యాక్సెంచర్, డెలాయిట్, వెరిజాన్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. గూగుల్ అందించే కోర్సులు స్కిల్స్‌ని పెంచుకోవడానికి మాత్రమే కాకుండా గూగుల్ కెరీర్ సర్టిఫికెట్లు ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడుతున్నాయి.