అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి.. జనసేన డిమాండ్

  • అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరానికి ఇంకా 6 నెలలు కాలేదా..?
  • వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇంకా 6 నెలలు కాలేదా సీఎం గారూ..?
  • దొంగ హామీలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి మాట మర్చిపోవటం తగునా…?
  • అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు మరణాలు కనిపించవా..?
  • అగ్రీ గోల్డ్ బాధితుల డిపాజిట్లు చెల్లింపులో తాత్సారం ఎందుకు..?
  • కంపెనీ ఆస్తులు చేతిలో ఉండగా ప్రభుత్వం నాన్సుడి ధోరణి సరికాదు
  • ఈ బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు??
  • తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరిన జనసేన నాయకులు

పార్వతీపురం: అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాటలు నేడు ఏమయ్యాయని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. గురువారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లి గణేష్, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, గుంట్రెడ్డి గౌరీ శంకర్, కర్రీ మణి, కొల్లి వెంకటరావు, తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రూ.1183 కోట్లు కేటాయించి, 11 లక్షలు చిన్న డిపాజిట్ దారులకు డబ్బు చెల్లిస్తానని ఆరు మాసాల్లో మొత్తం డిపాజిట్ దారులకు డబ్బు చెల్లించే బాధ్యత నాదని, కోర్టు సంగతి కంపెనీ సంగతి సైతం చూసుకుంటానని ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని మర్చిపోవడం అన్యాయమన్నారు. లేకపోతే వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినప్పటికీ అగ్రీ గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి మాత్రం ఇంకా ఆరు నెలలు వారి దృష్టిలో పూర్తి కాలేదేమోనని ఎద్దేవా చేశారు. సిపిఎస్ మొదలుకొని అగ్రిగోల్డ్ లాంటి పలు దొంగ హామీలిచ్చి ఆ ఓట్లతో గద్దెనెక్కి వారిని మర్చిపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికీ 20 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన సుమారు మూడున్నర లక్షల మందికి, 20వేల రూపాయలు డిపాజిట్ చేసిన సుమారు ఆరున్నర లక్షల మందికి దాదాపు రూ.3,080 కోట్ల మేర చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం కంపెనీ ఆస్తులు రెట్టింపు అయ్యాయని, కంపెనీ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ డిపాజిట్ దారులకు, ఏజెంట్లకు డబ్బు చెల్లించడంలో కాలయాపన చేయటం సరికాదన్నారు. మాట తప్పను మడమ తిప్పను అని పాదయాత్ర సందర్భంగా పదేపదే అగ్రిగోల్డ్ బాధితులకు హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పట్ల మాట తప్పినట్లేనని, మడమతిప్పినట్లేనని అన్నారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు, అసహజ మరణాలతో మృతి చెందిన కుటుంబాలకు సైతం 10 లక్షల రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇంటికి పంపిస్తాం అన్న ముఖ్యమంత్రి ఆ మాట కూడా మర్చిపోవడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు చదువులు ఆగిపోవడం, పెళ్లిళ్లు చేయలేక, ఆరోగ్య సమస్యలతో అగ్రి గోల్డ్ బాధితులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలను బటన్ నొక్కి పేదలకు అందిస్తున్న ముఖ్యమంత్రికి అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరించాలన్న ఆలోచన ఉంటే ఆ సమస్య ఏపాటిది అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల చెల్లింపులు విషయంలో ప్రభుత్వం కంపెనీకి వత్తాసు పలుకుతుందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. కంపెనీ ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉండగా నాన్సుడు ధోరణి ఎందుకు అని ప్రశ్నించారు. అగ్రీ గోల్డ్ బాధితుల డిపాజిట్లు చెల్లింపుల్లో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందని ప్రశ్నించారు. తక్షణమే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.