ద్వారంపూడిని హెచ్చరించిన కాకినాడ జనసేన

కాకినాడ, జనసేనాని పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే సహించేది లేదంటూ కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డినుద్దేశించి జనసేన నగరాధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, పార్టీ జిల్లా నాయకుడు తలాటం సత్య, వాసిరెడ్డి శివ తదితరులు హెచ్చరించారు. ఈ మేరకు వారంతా సంయుక్తంగా ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటం సభలో ద్వారంపూడి నుద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేయడాన్ని వారు సమర్ధించుకున్నారు. అంతకుముందు తమకెలాంటి సంబంధంలేని వివాదంలోకి పవన్ పేరును ద్వారంపూడే ఎత్తారని మండిపడ్డారు. ఈ కారణంగానే పవన్ ఘాటుగా హెచ్చరికలుజారీ చేశారన్నారు. దీనిపై స్పందించిన ద్వారంపూడి మరోసారి జనసైనికులకు హెచ్చరికలు జారీచేయడాన్ని తాము తీవ్రంగా తప్పుబడుతున్నట్లు చెప్పారు. జనసైన్యం సామర్ధ్యాన్ని తెలుసుకొని ద్వారంపూడి నడుచుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని స్పష్టంచేశారు. ఇప్పటికే పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓలేటి రాము, వానపల్లి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.