సోమవారంతో కూడిన కార్తిక శుద్ధ చవితి ఎంతో ప్రశస్తమైనది!

తెలుగు రాష్ట్రాలు కార్తీకమాస శోభను సంతరించుకున్నాయి. నేడు కార్తీకమాసం తొలి సోమవారంతో పాటు.. నాగుల చవితి కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

కార్తికం లో ప్రతి నిత్యమూ పవిత్రమైనదే! విశేషించి కార్తిక సోమవారాలకు ప్రత్యేకత ఉంటుంది. కార్తిక సోమవారం నాడు పాటించే- స్నానం, దానం, దీపారాధనం, అర్చనం, దైవదర్శనం అనే పంచకృత్యాల్ని కార్తిక సోమవార వ్రతంగా అనుసరిస్తారు. వసిష్ఠమహర్షి ద్వారా జనకమహారాజు కార్తిక సోమవార వ్రత వైభవాన్ని తెలుసుకుని, మహాదేవుడి కృపకు పాత్రుడయ్యాడని పురాణాలు విశ్లేషించాయి. ఉపవాస దీక్షతో శుద్ధోదకం, గోక్షీరం, పంచామృతాలతో రుద్రాభిషేకాన్ని, బిల్వదళాలతో రుద్రార్చన కార్తిక సోమవారంనాడు నిర్వహించాలని రుద్రాక్షోపనిషత్తు వివరించింది. 

సోమవారంతో కూడిన కార్తిక శుద్ధ చవితి ఎంతో ప్రశస్తమైనదిగా స్కాందపురాణం పేర్కొంది. నాగులచవితిగా నిర్వహించుకునే ఈ పావన సందర్భం శివసుబ్రహ్మణ్య శక్తుల ఏకీకృత అనుగ్రహానికి కారకమవుతుందంటారు. శ్రీనాథుడి శివరాత్రి మాహాత్మ్యంలో, చతుర్వర్గ చింతామణిలో నాగులచవితి ఆచరణ విధుల్ని నాగవ్రతంగా ప్రస్తావించారు. బ్రహ్మపురాణం ఈ వ్రతాన్ని కౌటుంబిక క్షేమ ప్రక్రియగా చెబితే, అగ్నిపురాణం శాంతివ్రతంగా ప్రస్తావించింది. మహావిష్ణువుకు శయ్యగా, నీలకంఠుడికి కంఠాభరణంగా, వెలిగే సర్పాన్ని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆర్షధర్మం దర్శిస్తోంది.

నాగారాధన ఎన్నో అంతరార్థాల సమాహారం. యోగశాస్త్రరీత్యా, మన వెన్నెముకనే వెన్నుపాముగా వ్యవహరిస్తారు. దీనికి దిగువన కుండలిని శక్తి ఉంటుందంటారు. యోగసాధనతో కుండలిని శక్తిని సహస్రారానికి వెన్నుపాము ద్వారా ప్రయాణించడానికి సాధకులు నిరంతరం ప్రయత్నించాలని చెబుతారు. మన శరీరంలో అరిషడ్వర్గాలనే విషపూరితమైన భావాలు ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. శిరస్సు పైభాగాన ఉండే బ్రహ్మ రంధ్రం ద్వారా జ్ఞానక్షీరాన్ని స్వీకరించాలి. అందువల్ల, మన శరీరం అమృతమయమై, తేజస్సుతో ప్రకాశిస్తుంది. పుట్టలో నాగుల చవితినాడు పాలు పోయడంలో ఆంతర్యం ఇదే! జీవన ప్రస్థానానికి ‘నాగం’ అనే పేరూ ఉంది. సర్పం వలే ప్రతి వ్యక్తీ గమనశీలత్వాన్ని చలనశీలత్వాన్ని సంతరించుకుని, జీవిత పథాన పురోగమించాలి! మన శరీరం నవరంధ్రాలున్న మట్టి పుట్ట. ఈ పుట్టలో అనేక కాలనాగులు పొంచి ఉంటాయి. అవి విజృంభించకుండా ఉండటానికి ఆధ్యాత్మిక చింతన అనే మధు ధారల్ని ఎల్లవేళలా మనలోకి మనం నిక్షిప్తం చేసుకోవాలి. అంతర్వీక్షణతో, మనల్ని మనం ఉద్ధరించుకుంటూ దీపశిఖలా, నాగమణిలా విరజిమ్మాలని నాగులచవితి నేపథ్యంగా సనాతన సంప్రదాయం సందేశమిస్తోంది!