కుటుంబ సభ్యులతో కలసి కాశీ యాత్రకు కేసీఆర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన కుటుంబ సభ్యులతో కలసి నేడు, రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఆయన వెంట భార్య శోభ, కుమార్తె కవిత, ఇతర కుటుంబీకులు కూడా ఉన్నారు. కేసీఆర్ వారణాసి పర్యటనకు అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి.

నేడు వారణాసిలో అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేథ ఘాట్ వరకూ పడవ ప్రయాణం చేయనున్న వీరు, ఆపై గంగా హారతిని, ప్రత్యేక పూజలను తిలకిస్తారు. అనంతరం సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయంలో కేసీఆర్ పూజలు చేసి, స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని, రేపు కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు వెల్లడించారు.