వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన కేకే

కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రాజ్యసభలో తెరాస ఎంపీలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కేశవరావు మాట్లాడారు. కొత్త వ్యవసాయ బిల్లుతో రైతులను తీరని నష్టం జరిగే అవకాశముందని, శాసన వ్యవస్థను నవ్వులపాలు చేశారని ఎంపీ కేకే ధ్వజమెత్తారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి రోజు చూడలేదని తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌ను ప్రభుత్వం ప్రభావితం చేసిందని, వ్యవసాయ బిల్లుపై ఓటింగ్ వచ్చేసరికి ప్రభుత్వం భయపడిందని, రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు ఎందుకు జరపలేదు? అని కేకే ప్రశ్నించారు.

రాజ్యసభలో ప్రభుత్వానికి మద్దతు లేకపోయినా.. మూజువాణి ఓటు పెట్టడం ఏంటి? అని కేకే ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం బిల్లును రూపొందించిందని ఆక్షేపించారు. రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్లను పెంచి పోషించేలా.. మార్కెటింగ్‌ ఏజెంట్లకు సైతం నష్టం కలిగించేలా ఈ కొత్త చట్టం ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఏ పథకానికి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. మరోవైపు, ఈ బిల్లులకు టీడీపీ, వైకాపాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.