రైతుల ఉద్యమంలో కీలక పరిణామాలు..

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యమం నుంచి తాము తప్పుకుంటున్నట్టు రెండు రైతు సంఘాలు.. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన (ఆర్‌కేఎంఎస్), భారతీయ కిసాన్ యూనియన్ (భాను) ప్రకటించాయి. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్‌కేఎంఎస్ కన్వీనర్ సర్దార్ వీఎం సింగ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే నాడు రాజధానిలో జరిగిన సంఘటనలు బాధించాయన్నారు. ఇతరుల ఆధ్వర్యంలో నిరసన కొనసాగించలేమని పేర్కొన్నారు.

కొన్ని రైతు సంఘాలు ఇతరులు చెప్పినట్టు పనిచేస్తున్నాయని ఆరోపించారు. నిన్నటి ఉద్రిక్తతకు రాకేశ్ తికాయత్ వంటి నేతల వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయానికి ముందే ర్యాలీని ఎలా ప్రారంభించారని, ఇతర మార్గాల్లో ర్యాలీని ఎందుకు తీసుకెళ్లారని వీఎం సింగ్ మండిపడ్డారు.

ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం పూర్వీకుల త్యాగఫలమన్న ఆయన దానిపై నిన్న జెండా ఎగురవేసి ఏం సాధించామని ప్రశ్నించారు. తాము ఉద్యమం నుంచి తప్పుకోవడానికి నిన్నటి ఘటనే కారణమని స్పష్టం చేశారు. తామిక్కడకు దెబ్బలు తినేందుకు, చనిపోయేందుకు రాలేదని, హక్కులు సాధించుకునేందుకే వచ్చామన్న ఆయన.. మద్దతు ధర కోసం, రైతుల హక్కుల కోసం తాము పోరాడుతూనే ఉంటామన్నారు. బీకేయూ (భాను) అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. నిన్నటి ఘటనలు తమను బాధించాయని, అందుకనే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.