రాజస్థాన్‌ రాయల్స్‌ పై కోల్‌కతా విజయం

దుబాయ్​ వేదికగా బుధవారం జరిగిన ఐపీఎల్​ బిగ్ ఫైట్‌లో రాజస్థాన్​ రాయల్స్​పై 37 పరుగుల తేడాతో కోల్​కతా నైట్​రైడర్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది కేకేఆర్​. కోల్‌కతా యువ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్‌ విలవిల్లాడింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి  కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ గిల్‌ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. చివర్లో మోర్గాన్‌ మెరుపులతో కేకేఆర్‌ 170 పరుగుల మార్కును దాటింది. కాగా 34 బంతుల్లో 47 పరుగులు చేసిన గిల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి పోరాడే స్కోరును ఆర్ ఆర్ ముందు ఉంచిన కేకేఆర్‌.. ఆపై బౌలింగ్‌లో సత్తా చాటింది. బ్యాటింగ్‌ లైనప్‌లో పటిష్టంగా ఉన్న రాజస్థాన్‌ను 137 పరుగులకే కట్టడి చేసి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

కేకేఆర్‌ బౌలర్లలో శివం మావి, నాగర్‌కోటి, ప్యాట్‌ కమిన్స్‌, వరుణ్‌ చక్రవర్తిలు రాణించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. మావి, నాగర్‌కోటి, వరుణ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, కమిన్స్‌, కుల్దీప్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు చెరో వికెట్‌ తీశారు. రాజస్థాన్‌ ఆటగాళ్లలో టామ్‌ కరాన్‌( 54 నాటౌట్‌; 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశారు. ఇక రాజస్తాన్‌ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఘోర ఓటమికి కారణంగా మారింది. ఇది కోల్‌కతాకు రెండో విజయం కాగా, రాజస్తాన్‌కు తొలి ఓటమిని ముటగట్టుకుంది.