నాయకులకు అన్నిటా ప్రగతి నేటికీ రాయలసీమ అభివృద్ధి మాత్రం అధోగతి.‌.!

  • జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య

చిత్తూరు, నాయకులకు అన్నిటా ప్రగతి.. నేటికీ రాయలసీమ అభివృద్ధి మాత్రం అధోగతి.‌.! అని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… సమైక్యాంధ్ర మొదలుకొని నేటివరకు రాష్ట్రాన్ని రాయలసీమకు చెందిన నాయకులే ఎక్కువ శాతం పైగా పాలించారన్నారు. అయినప్పటికీ రాయలసీమ మాత్రం అభివృద్ధికి నోచుకోలేక, వెనుకబాటుతనానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాయలసీమలో కరువు కాటకాలు అధికంగా ఉన్నందున ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ నేతలను సీఎంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ప్రజలందరూ భావించారన్నారు. అనేకసార్లు రాయలసీమకు చెందిన వ్యక్తులను ముఖ్యమంత్రిగా చేసినా… ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని శివయ్య మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేసిన దాఖలాలు లేవని, అయితే వీరు ఉన్నత పదవులు పొంది అధికారం అడ్డుపెట్టుకుని తమ వ్యక్తిగత ఆర్థిక ప్రగతిని తరతరాలకు తరగని రీతిలో సాధించుకున్నారని ఆరోపించారు. తాము, తమ కుటుంబం అన్నివిధాలా రాబందుల్లా దోచుకుని దాచుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న ఘనత పలువురు గత పాలకులు, నేటి పాలకులకు ఉన్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వార్థంతో స్వలాభం కోసమే ఉన్నత పదవులు పొంది, అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని లూటీ చేయడమే లక్ష్యంగా చేసుకున్నారు తప్ప రాయలసీమను మరింత వెనుకబడి పోయేలా చేశారని ఆయన అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ నేతలు మూడు రాజధానులు అని పేర్కొంటూ అభివృద్ధి మంత్రం జపిస్తూ.. ఒక ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయకుండా మూడు చోట్ల రాజధానులు అంటూ రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తున్నారని పాలకుల తీరును శివయ్య దుయ్యబట్టారు.