టీకాపై భయాలు వీడండి: ప్రధాని మోదీ

కరోనా వ్యాక్సిన్‌పై నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను వీడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. తనతో పాటు 100 ఏళ్ల వయసున్న తన మాతృమూర్తి సైతం రెండు డోసుల టీకా తీసుకున్నట్లు వెల్లడించారు.

”మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.. శాస్త్ర విజ్ఞానాన్ని నమ్మండి. శాస్త్రవేత్తలను విశ్వసించండి. ఇప్పటికే అనేక మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. నేను రెండు డోసులు వేయించుకున్నాను. 100 ఏళ్ల వయసున్న మా అమ్మ కూడా రెండు డోసుల టీకా తీసుకున్నారు. టీకాలపై వస్తున్న వదంతులను నమ్మొద్దు” అని మన్‌ కీ బాత్‌ సందర్భంగా దేశ ప్రజలను మోదీ కోరారు.

కేవలం వ్యాక్సిన్‌ ద్వారా మాత్రమే మహమ్మారి నుంచి తప్పించుకోగలమని మోదీ తెలిపారు. వదంతులు వ్యాప్తి చేసే వారిని పట్టించుకోవద్దన్నారు. మన చుట్టూ ఉన్న ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు. మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్‌తో పాటు కరోనా కట్టడి నిబంధనల్ని పాటించాలని కోరారు.

దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై భయాందోళనలు నెలకొన్న తరుణంలో మోదీ వ్యాక్సిన్‌ ప్రాముఖ్యతను వివరించడం గమనార్హం. క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పుంజుకుంటుండడంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని మరింత వేగవంతం చేయాలని అధికారుల్ని శనివారం జరిగిన సమీక్షాసమావేశంలో ఆదేశించారు.