చివరి రక్తపు బట్టువరకు పోరాడతాం – తలవంచని పంజ్‌షీర్‌

చివరి రక్తపు బట్టు వరకు తాలిబన్‌లతో పోరాడతామని పంజషీర్‌ పైటర్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరి భుంజపై ఆయుధం ఉందని, తాలిబన్‌లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ( ఎన్‌ఆర్‌ఎఫ్‌), తాలిబన్‌ వ్యతిరేక మిలీషియా పోరాట యోధులు, మాజీ ఆఫ్ఘన్‌ భద్రతా దళాలు సంయుక్తంగా తాలిబన్‌లను ఎదుర్కొంటామని ప్రతిజ్ఞ చేశాయి. యువకుల నుండి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్కరు యుద్ధంలో భాగమవుతామని స్థానికులు కూడా తెలిపారు. మొదటి నుండి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు తాలిబన్‌లు యత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆ ప్రావిన్సుపై దాడికి దిగినప్పుడు ఎదురుదెబ్బ తగలడంతో.. తాజాగా తాలిబన్‌లు చర్చల బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే పంజ్‌షీర్‌ సమస్యను చర్చలతో పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేశామని అయితే .. చర్చలు ఫలించలేదని తాలిబన్‌ సీనియర్‌ అధికారి అమీర్‌ ఖాన్‌ ముత్తాకీ ట్విట్‌ చేశారు. పర్వాన్‌ ప్రాంతంలో పంజ్‌షేర్‌ నేతలు, పలువురు ఇతర గిరిజన తెగల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామని, ఆయుధాలు వీడి తమతో చేతులు కలపాలని కోరినట్లు తెలిపారు. అయితే చర్చలు విఫలం కావడంతో.. తాలిబన్‌లు పంజ్‌షీర్‌ని చుట్టముట్టాయని అన్నారు. బుధవారం రాత్రి తాలిబన్‌ ఉగ్రవాదులు పంజ్‌షీర్‌పై దాడి చేశారు కానీ ఓడిపోయారని అన్నారు. ఈ పోరాటంలో 34 మంది తాలిబన్‌లు మరణించగా, 65 మంది గాయపడ్డారు. అయితే ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుండి జరిపిన పోరాటాల్లో ఇప్పటివరకు తాము సుమారు 350 మంది తాలిబన్‌లను హతమార్చామని పంజ్‌షీర్‌ ఫైటర్లు ప్రకటించారు. మరో 40 మందిని బంధించినట్లు తెలిపారు.