యువశక్తితో జనసేన సత్తా చాటుతాం: యడ్లపల్లి రామ్ సుధీర్

• వైసీపీ యువతకు ఉపాధి లేకుండా చేసింది
• జగన్ రెడ్డి తన పాలనతో యువతను పెడదోవ పట్టించారు
• జోగి రమేష్ పెడన నియోజకవర్గాన్ని పేకాట క్లబ్బుగా మార్చారు
• గంజాయిని గ్రామ స్థాయికి తెచ్చిన ఘనత వైసీపీ నాయకులదే
• ఉపాధి లేక యువత వలసలు పోతుంటే.. జోగి రమేష్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు
• కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం ఎందుకు పరామర్శించలేదు
• ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ప్యాకేజీ కోసం మీ నాయకుడు కేసీఆర్, పవర్ ల చుట్టూ తిరిగాడు
• జోగి రమేష్ కి ఓటమి కళ్లెదుటే కనబడుతోంది
• అందుకే పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు
• యవశక్తి సభతో మీకు బట్టలు తడవడం ఖాయం

పెడన, వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. ఈ ప్రభుత్వం చదువుకుందామంటే విద్యా వ్యవస్థను నాశనం చేశారు. చదువు పూర్తి చేశాక రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలు రాష్ట్రం మొత్తం పాకించి యువతను పెడదోవ పట్టిస్తున్నారు. వైసీపీ పాలనలో నిర్వీర్యమై వున్న యువతకు తిరిగి జవసత్వాలు నింపేందుకు, నూతనోత్తేజం నింపేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12వ తేదీన మహనీయులు స్వామి వివేకానంద జయంతి రోజున, యువజన దినోత్సవాన శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా యువశక్తి సభ నిర్వహిస్తున్నారు. యువశక్తి సభ యువతకు ఓ సువర్ణావకాశం. యువశక్తి సభ కథనోత్సాహంతో ముందుకు వచ్చే యువత పాలిట సమరగళం కానుంది. రాష్ట్ర యువత సత్తా ఏంటో చాటిచెప్పేందుకు పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన సభతో యువసత్తాతో పాటు జనసేన పార్టీ శక్తి ఏంటో అధికార పార్టీకి తెలిసి వస్తుంది. రణస్థలం సభ ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యువ ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు జనసేన ప్రభుత్వం ఎలాంటి విధానాలు తీసుకురానుంది అనే అంశాలను వివరించనున్నారు. యువత కోసం ఓ ప్రత్యేక మ్యానిఫెస్టోని రూపొందించనున్నారు. తొలిసారి ఓ రాజకీయ పార్టీ వేదికపై నాయకుల ప్రసంగాలు పక్కనపెట్టి సామాన్య యువతకు గళం విప్పే అవకాశం కల్పించారు. తమ సమస్యలు ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కల్పించారు. రాజకీయాల్లో ఓ నూతనాధ్యాయానికి నాంది పలికిన పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలపాల్సిన బాధ్యత ప్రతి యువతీయువకులందరి మీద ఉంది. పెడన నియోజకవర్గ యువత పెద్ద ఎత్తున యువశక్తి సభకు తరలివచ్చి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.

• జోగీ నీకు బుద్దుందా..!

ఇక నియోజకవర్గం విషయానికి వస్తే.. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టు మంత్రి పదవి వచ్చింది గానీ జోగి రమేష్ కి మునుపుటి చేష్టలు మాత్రం పోలేదు. జోగీ నీకసలు బుద్దుందా..! ఓ వైపు వ్యవసాయం, మరో వైపు చేనేతలు, ఇంకో వైపు ఆక్వా వ్యాపారంతో ప్రశాంతంగా ఉండే పెడన నియోజకవర్గాన్ని పేకాట క్లబ్బుగా మారుస్తావా? నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ పేకాట క్లబ్బులు నడుపుతున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. పోస్టర్లు అంటించామని కేసులు పెట్టిన పోలీసులకు ఆ పేకాట క్లబ్బులు కనబడడం లేదా? నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి గంజాయి తీసుకువచ్చిన ఘనత వైసీపీ నాయకులది కాదా.. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసిన ఘనత మీది కాదా? పెడన నియోజకవర్గ యువత ఉపాధి వెతుక్కుంటూ వలసలు పోతుంటే సిగ్గూశరం లేకుండా పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పేలుతావా.. మంత్రి జోగి రమేష్ కి ఓటమి కళ్లెదుట కనబడుతోంది. తనకు ఇక ఇవే చివరి ఎన్నికలు అన్న సంగతి అర్ధం అయిపోయింది. అందుకే పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు.

• మీ సీఎం ఎంత మందిని పరామర్శించారు?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ సభల్లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించలేదు అని వాగుతున్న వైసీపీ నేతలు. రాష్ట్రంలో 3 వేల మంది కౌలు రైతులు చనిపోతే మీ ముఖ్యమంత్రి ఎందుకు వారి కుటుంబాలను పరామర్శించలేకపోయారో చెప్పాలి. ప్రచారార్భాటం కోసం ముఖ్యమంత్రి సభలకు తరలించే జనం ఉక్కిరిబిక్కిరై, ఊపిరాడక ప్రాణాలు వదిలితే అందులో ఎంత మంది కుటుంబాలను మీ ముఖ్యమంత్రి పరామర్శించాడో చెప్పాలి. ఓట్లేసిన ప్రజలు చనిపోతే మీ సీఎం తాడేపల్లి ప్యాలెస్ దాటి రాడు. కనీసం సానుభూతి చూపడు.. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతారా? 3 వేల మంది కౌలు రైతుల కుటుంబాలను పేరు పేరునా పలుకరించి అధికారం లేకపోయినా సొంత సంపాదన నుంచి ఆదుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, పిల్లికి బిచ్చంపెట్టని మీ ముఖ్యమంత్రికి నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. విలువలు వదిలేసి నోరుసుకుపడినంత మాత్రాన జనం నమ్మేస్తారనుకోవద్దు.

• కృత్తివెన్ను అక్రమ తవ్వాకాల్లో జోగి ప్యాకేజీ ఎంతో చెప్పాలి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శకు వెళ్లలేదని చెబుతున్న జోగి రమేష్ కి పెడన నియోజకవర్గానికి చెందిన బాధ్యత గల పౌరుడిగా ఓ రెండు ప్రశ్నలు అడుగుతున్నాం. నీలో ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా సమాధానం చెప్పు. కృత్తివెన్ను మండలంలో సాగుతున్న అక్రమ చెరువుల తవ్వకాల వెనుక ఎవరున్నారో మంత్రి జోగి రమేష్ ప్రజలకు చెప్పాలి. అక్రమ తవ్వకాలు అని తెలిసినా ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలి. ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలి. మాట్లాడితే ప్యాకేజీ ప్యాకేజీ అంటారు. ప్రతిపక్షంలో ఉండగా మీ నాయకుడు జగన్ రెడ్డి కేసీఆర్, శరద్ పవార్ ల చుట్టు పదే పదే చక్కర్లు కొట్టినందుకు ఎవరి దగ్గర ఎంతెంత ప్యాకేజీ తీసుకున్నాడో చెప్పాలి. అధికారం కోసం కేసీఆర్ ని కలసిన ఆయన తండ్రి వైఎస్ఆర్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలి. పవన్ కళ్యాణ్ మీద కారుకూతలు కూసే ఏ ఒక్కడినీ వదిలిపెట్టేది లేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మీకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీకు పోయేకాలం దగ్గర పడింది. అందుకే పిచ్చి ప్రేలాపనలతో ప్రచారం కోసం ఎగబడుతున్నారు. జనసేన పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ నా మీద నమ్మకంతో నాకంటూ ఓ ప్రత్యేక బాధ్యతను అప్పగిస్తున్న మా ఆరాధ్య దైవం, మా అధినేత పవన్ కళ్యాణ్ కి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ.. యువశక్తి సభ విజయానికి నా వంతు కృషి చేస్తానని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి వరుదు రమాదేవి, మత్స్యకార వికాస విభాగం కార్యదర్శి వొడుగు ప్రభాస్ రాజు, కూనపరెడ్డి రంగయ్య, చెనేత విభాగం కార్యదర్శి పేరిసెట్టి విఘ్నేశ్వరరావు, సయ్యద్ షఫీ, వరుదు రాము, వరుదు సాయి, గూడూరు మండలం అధ్యక్షులు దాసరి ఉమా సాయి రామ్, కృత్తివెన్ను మండలం ఉపాధ్యక్షులు పాశం నాగమల్లేశ్వర రావు, కొక్కు వాసు, పోలగాని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గా రావు, గోట్రు నాని, కొప్పినీటి నరేష్,మారుబోయన సుబ్బు, సమ్మెట ప్రసాద్, కూనపరెడ్డి గంగ రాజు, జన్యువుల నాగబాబు, సుంకర అంజి, పెన్నేరు మణికంఠ, దివి శ్రీనివాస్, కొప్పినేటి శివమణి, కాజ మణికంఠ, షేక్ మున్నా, పుప్పాల జోగి, బావిశెట్టి ఫణీంద్ర, కొఠారి మల్లిబాబు, అఖిల్, కమ్మెల అరుణ్, నందం శివ స్వామి, బాకీ నాని, బాదం వినోద్, పవన్ మరియు పెడన నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.