మనకున్నది ఒకటే జీవితం.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం: జాక్వెలిన్

మనకు ఉన్నది ఒకటే జీవితమని.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుందామని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పారు. ఇటీవలే ఆమె ‘యూ ఓన్లీ లివ్ వన్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కరోనా సమయంలో ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ సంస్థ ద్వారా ఇతరులకు తన వంతు సాయం చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఆకలి కడుపు నిండినప్పుడే అసలైన శాంతి నెలకొంటుందని మదర్ థెరిస్సా అన్నారని చెప్పారు.

ముంబై మాజీ పోలీస్ కమిషనర్ శివనందన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రోటీ బ్యాంక్’ను జాక్వెలిన్ సందర్శించారు. ఈ సందర్భంగా పేదలకు భోజనాన్ని కూడా వడ్డించారు. రోటీ బ్యాంక్ ను చూసి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని ఈ సందర్భంగా తెలిపారు. కరోనా సమయంలో ఈ సంస్థ ఎంతో మంది కడుపు నింపుతోందని చెప్పారు. ప్రస్తుతం జాక్వెలిన్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. మరో సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేయనుంది.