పవన్ కళ్యాన్ కి ఘనంగా స్వాగతం పలుకుదాం: నేరేళ్ళ సురేష్

  • పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాలను జనసేన నాయకులతో కలసి పరిశీలించిన అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: ఆరుగాలం కష్టపడి పండించిన పంట ప్రకృతి వైపరిత్యాలతో చేతికిరాక ఒకవైపు అదృష్టవశాత్తూ పంట చేతికి వచ్చినా కనీస మద్దతు ధర రాకపోవడంతో అప్పులపాలై ఆదుకునే దిక్కులేక బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆదివారం సత్తెనపల్లి వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలకాలని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాలను సురేష్ పరిశీలించారు. ఏటుకూరు ప్రాంతంలోని కూడలిని, చుట్టుగుంట సెంటర్లను పరిశీలించి ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో జనసైనికులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రధానంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో వస్తారని వారికి రక్షణగా నిలవాలని కార్యక్రమ వాలంటీర్లను, పోలీసులను కోరారు. అక్కడికి వచ్చిన ప్రజలకు మంచినీరు, మజ్జిగతో పాటూ ఓ ఆర్ యస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని అలాగే స్పెషల్ అంబులెన్స్ ని కూడా ఏర్పాటు చేసినట్లు నేరేళ్ళ సురేష్ తెలిపారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో కార్పొరేటర్ దాసరి లక్ష్మీదుర్గ, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, దాసరి వాసు, డివిజన్ అధ్యక్షుడు విష్ణుమొలకల వీరాంజనేయులు, నగర కార్యదర్శి బందెల నవీన్ కుమార్, అంకిరెడ్డి శ్రీనివాస్, శివాలశెట్టి శ్రీనివాస్, బోరుగడ్డ సాయి తదితరులు పాల్గొన్నారు.