కారు డోరు వల్లే మమత కాలికి గాయం: ఈసీకి ప్రధాన కార్యదర్శి నివేదిక

తనను తోసేయడం వల్లే కాలు విరిగిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు ఒకవైపు.. బీజేపీ వారే దానికి కారణమని ఆమె పార్టీ నేతల ఆరోపణలు మరోవైపు.. దానికి రివర్స్ గా మమత నాటకాలు ఆడుతున్నారని బీజేపీ ఎదురుదాడి ఇంకోవైపు! ఎవరి వాదనలు వారివే అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మాత్రం.. కారు డోరు తగలడం వల్లే ముఖ్యమంత్రి కాలికి గాయమైందని అంటున్నారు.

ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. నందిగ్రామ్ లో నామినేషన్ దాఖలు చేశాక తిరుగు ప్రయాణంలో మమత కాలికి గాయమైన సంగతి తెలిసిందే. కారు డోరు తెరచి.. నిలబడి అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కారు డోరు అక్కడి స్తంభానికి తగిలి ఆమె కాలు నలిగినట్టు వీడియోల్లో కనిపించింది. ఆ వెంటనే ఆమె తనను నలుగురైదుగురు తోసేశారని ఆరోపించారు. అయితే, ఆమెను ఎవరూ తోసేయలేదంటూ అక్కడే ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంద్యోపాధ్యాయ్ నివేదికను సమర్పించారు. కారు డోరు వల్లే మమత కాలికి గాయమైందని నివేదికలో పేర్కొన్నా.. అసలు కారు డోరు మమత కాలికి ఎలా తగిలిందన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ చాలా మంది గుమిగూడారని పేర్కొంది. ఆమె ప్రయాణిస్తున్న కారుకు ఓ ఇనుప స్తంభం అతి చేరువలోనే ఉందని చెప్పింది. అయితే, ఆ ఇనుప స్తంభాన్ని ఢీకొనడం వల్లే కారు డోరు పడి ఆమె కాలికి గాయమైందా అన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు.